నగరంలోని సైదాబాద్ పరిధిలో ఉన్న సక్సెస్ స్కూల్ చుట్టూ ఇప్పుడో పెద్ద గొడవ జరుగుతోంది. కేవలం రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి.. కల్మా చదువుకుని రావాలంటూ ఓ టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ఇది మాత్రమే కాకుండా మరికొన్ని మత ప్రార్థనలను కూడా నేర్చుకుని రావాలంటూ సదరు విద్యార్థి డైరీలో రాసి పంపించింది. అయితే ఇంటికి వచ్చాక ఆ డైరీ చూసిన విద్యార్థి తల్లిదండ్రులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు బడికి వెళ్లి.. చిన్న వయసులోనే విద్యార్థులపై మతపరమైన అంశాలను రుద్దే ప్రయత్నం చేయడం దారుణం అంటూ గొడవకు దిగారు. అసలు హిందూ బాలుడికి కల్మా చదవాలని ఎలా నేర్పిస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులు, పాఠశాల వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సైదాబాద్ సక్సెస్ స్కూల్‌లో ఒక హిందూ బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. కాగా తరగతి గదిలో పాఠాలు చెప్పే సమయంలో సదరు క్లాస్ టీచర్.. ఆ బాలుడికి ఇస్లామిక్ పవిత్ర సూక్తులైన కల్మా, సూరహ్ ఫాతిహాలను చదవడం నేర్చుకోవాలని హోమ్‌వర్క్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థి ప్రతిరోజూ ఇంటికి తీసుకెళ్లే స్కూల్ డైరీలో సైతం.. కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలి అని స్పష్టంగా పెన్నుతో రాసింది. బాలుడు ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు అతని హోమ్‌వర్క్ పుస్తకాలు, డైరీని పరిశీలించగా ఈ షాకింగ్ విషయం బయటపడింది.
చిన్న వయసులోనే ఇస్లామిక్ ప్రార్థనలను హోమ్‌వర్క్‌గా ఇవ్వడంపై బాలుడి తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుసటి రోజు ఉదయమే వారు మరికొంత మంది బంధువులను, స్థానికులను వెంటబెట్టుకుని నేరుగా సైదాబాద్ సక్సెస్ స్కూల్‌కు చేరుకున్నారు. డైరీలో రాసిన మతపరమైన అంశాలను చూపించి, సదరు ఉపాధ్యాయురాలితో పాటు స్కూల్ డైరెక్టర్లను, యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. సెక్యులర్ విద్యావిధానాన్ని అమలు చేయాల్సిన విద్యా సంస్థల్లో ఒక నిర్దిష్ట మత ప్రార్థనలను ఇతర మతాల పిల్లల చేత బలవంతంగా చదివించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని వారు గట్టిగా నిలదీశారు.
ఈ సంఘటనతో పాఠశాల ప్రాంగణంలో కాసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యా సంస్థల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
