Minister Sridhar Babu: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి: మంత్రి శ్రీధర్ బాబు

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఆయనను కలిసి మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు.

Published By: HashtagU Telugu Desk
Minister Sridhar Babu

Minister Sridhar Babu

Minister Sridhar Babu: ‘కాళేశ్వరం- మంథని-రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్ గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఆయనను కలిసి మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు.

‘ద‌క్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయానికి వేయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. దేశంలో ఎక్కడా కనిపించని విధంగా గర్భ గుడిలో రెండు శివలింగాలు జలందుకుంటున్నాయి. ఒకటి ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటి కాళేశ్వరునిది (యముడు). ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది మేలో సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరించేందుకు వస్తారని అంచనా వేస్తున్నాం. ఇక్కడే 2027లోనూ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అప్పుడు కోటి మందికి పైగా వచ్చే అవకాశముంది. సోమ్ నాథ్, కేదార్ నాథ్, మహాకాళేశ్వర్, అయోధ్య, కాశీ ల మాదిరిగా ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయాన్ని కూడా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, ఎకో టూరిజం హబ్ గా అభివృద్ధి చేయోచ్చు. ఇప్పటికే ఇందుకు సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందించాం. దీని అమలుకు కేంద్రం సహకరించాలి. భక్తుల సౌకర్యార్థం పుష్కరాలు మొదలయ్యే నాటికి ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చొరవ చూపాలి’ అని విజ్ఞప్తి చేశారు.

Also Read: Minister Counter To MP: 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే.. ఎంపీకి మంత్రి కౌంట‌ర్‌!

‘రామగిరి కోటకు సుమారు 1200 ఏళ్ల చరిత్ర ఉంది. రామాయణంలోనూ దీని గురించిన ప్రస్తావన ఉంది . రాముడి ఆలయాలు, జలపాతాలు, ఎన్నో ఔషధ మొక్కలు ఇక్కడున్నాయి. ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రానికి కావాల్సిన అన్ని ఆకర్షణలు ఇక్కడున్నాయి. ఈ కోటను సందర్శించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. స్వదేశీ దర్శన్ 2.0 లేదా ఇతర పథకాల కింద ఈ కోటను మెగా టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.

  Last Updated: 15 Jan 2025, 05:49 PM IST