తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Housing Scheme 2025) నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకానికి సంబంధించిన లబ్దిదారుల జాబితా ఇప్పటికే ప్రకటించబడినప్పటికీ, నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం.. మహబూబ్ నగర్ (mahabub nagar) జిల్లా నుండి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం గృహనిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
ఇందిరమ్మ ఇండ్ల ప్రాజెక్టు అమలుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka )సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. MLC ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని భట్టి విక్రమార్క అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. దీనిలో భాగంగా ముందుగా మహబూబ్ నగర్ నుంచే నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణపై కూడా భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. గృహనిర్మాణ శాఖతో పాటు రెవెన్యూ శాఖ సమన్వయంతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయాలని సూచనలు ఇచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు షార్ట్ ఫిల్మ్ రూపంలో ప్రచారం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయడం కోసం ఆధునిక మార్గాలను అనుసరించాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లతో పాటు, శాటిలైట్ టౌన్‌షిప్ నిర్మాణాలపై కూడా గృహనిర్మాణ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇండ్ల నిర్మాణంతో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే భవిష్యత్తులో నివాస సముదాయాలు నిర్మించేటప్పుడు ఆధునిక సదుపాయాలను కలిపి అభివృద్ధి చేయాలని సూచించారు. భూమి వివాదాలను తగ్గించేందుకు డిజిటల్ భూ సర్వేను ఆధునాతన సాంకేతికతతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయ భవనాలపై సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసి, పర్యావరణ అనుకూలమైన విద్యుత్ వినియోగాన్ని పెంచాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, లక్షలాది మంది పేద కుటుంబాలకు తమ స్వంత ఇంటి కలను నెరవేర్చే అవకాశముంది.