కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్‌లో తన వద్ద ఉన్నగన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. తలకు బలమైన గాయం అవ్వడంతో కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. సూర రజినీ కుమార్ కౌటాల పోలీస్ స్టేషన్‌లో సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 13వ బెటాలియన్‌కు చెందినవాడని కౌటాల ఇన్‌స్పెక్టర్ బుద్దె స్వామి తెలిపారు. రజినీ కుమార్ స్వస్థలం మంచిర్యాల బట్వాన్‌పల్లి. రజనీ కుమార్ దవడలో బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు.
తుపాకీ కాల్పుల శబ్దం విన్న స్టేషన్‌లోని ఇతర పోలీసులు బయటకు పరుగులు తీయగా రక్తపు మడుగులో పడి ఉన్న రజినీ కుమార్ ని వెంటనే కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. రజనీ కుమార్ 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అతని కుటుంబంలో ఆర్థిక సంక్షోభం కారణంగా నిరాశకు గురయ్యారు. అయితే ఇది మిస్ ఫైర్ కాదా లేక ఆత్మహత్యా అనే విషయంపై పోలీసులు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్నఎస్పీ సురేష్ కుమార్ కాగజ్‌నగర్‌లోని ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తూ తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా లేదా కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించే ప్రయత్నం చేశారా అనే కోణంలో వారు దృష్టి సారించారు.