KTR : హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గల్లంతు చేయాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. రైతులకు సాగునీరు ఇవ్వలేని దద్దమ్మ సర్కారు ఇప్పుడు నగర ప్రజలకు నిత్యావసరమైన ఉచిత తాగునీటి పథకాన్ని కూడా తొలగించాలని చూస్తోంది. ఇది ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకం ద్వారా హైదరాబాద్‌లోని కోటి 20 లక్షల ప్రజలకు మంచి నీరు నిరంతరంగా అందుతుంది. అలాంటి పథకాన్ని తవ్వేయాలన్న తపనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.
Read Also: Viveka murder case : వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తి..కోర్టుకు వెల్లడించిన సీబీఐ
హైదరాబాద్ వాసుల జీవనశైలిని మించిన విధంగా ప్రభావితం చేసే ఫ్రీ వాటర్ స్కీమ్‌ను తాకితే, అది సీఎం మసే! అంటూ ఆయన గట్టి హెచ్చరిక చేశారు. ఇప్పటికే 20 నెలలు కావస్తున్నా, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలలో ఒక్కటీ అమలుకాకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు ఫ్రీ వాటర్ స్కీమ్‌ను కూడా రద్దు చేస్తే, కాంగ్రెస్ పార్టీని ప్రజలు చరిత్రలో క్షమించరు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో నగర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది అని కేటీఆర్ విమర్శించారు. అంతేకాదు, హైడ్రా వంటి అనవసరమైన నిర్ణయాలతో ఇప్పటికే నగర వాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా దెబ్బతినడం, కరెంట్ కోతలు మళ్లీ పట్టుబడటం ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత యొక్క పరిణామాలు అని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో 24 గంటల విద్యుత్‌తో హైదరాబాద్ ప్రజలు ఆనందంగా జీవించారని, ఇప్పుడు మళ్లీ విద్యుత్ సమస్యలు తలెత్తడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. ఇదంతా చూస్తే, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలతోనే ముందుకు సాగుతోంది. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు కనీస సౌకర్యాల కోసం తడబడ్డారు అని ఆయన ఆరోపించారు. అవసరమైన మంచి నీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను పట్టించుకోకుండా ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టే ఈ సర్కారు తీరును ప్రజలు భరించరని స్పష్టం చేశారు కేటీఆర్. ఇలాంటి కుట్రలకు తగిన గుణపాఠం చెబడానికి హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఫ్రీ వాటర్ స్కీమ్‌ను గండికొట్టే ప్రయత్నాలు చేస్తే ప్రజలే ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి పెట్టి తీరతారు అంటూ ఆయన హెచ్చరించారు.
Read Also: US Visa Rules : అమెరికా మరో చెత్త నిర్ణయం.. వ్యాపార, టూరిస్ట్ వీసాలకు బాండ్ షరతు