Site icon HashtagU Telugu

BRS Minister: తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలకు పాల్పడుతున్నారు: మంత్రి గంగుల

Minister Gangula Kamalakar Meeting with Millers association

Minister Gangula Kamalakar Meeting with Millers association

BRS Minister: కాంగ్రెస్‌కు చెందిన నాయకులే గతంలో పచ్చగా ఉన్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసి ఇక్కడి వనరులను పూర్తిగా దోచుకున్నారని, ఇప్పుడు మళ్లీ వాళ్లే ఓటు కోసం వస్తున్నారని, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఒక్క తప్పు చేస్తే మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్తామని, ఆలోచించి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని అన్నారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి గెలిచిన చరిత్ర ఇక్కడ లేదని, తనపై అభిమానం, తాను చేసిన అభివృద్ధి పనులతో కరీంనగర్‌ ప్రజలు వరుసగా రెండోసారి, మూడోసారి విజయం అందించి అక్కున చేర్చుకున్నారని, వారి ఆదరాభిమానులు జీవితంలో మరిచిపోనన్నారు.

మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డితోపాటు ఆంధ్రా నాయకులు షర్మిల, పవన్‌కల్యాణ్‌, తదితరులు హైదరాబాద్‌లో మకాం వేసి తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఐదు నెలల కాంగ్రెస్‌ పాలనకే కర్ణాటకలో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌ ఒకటేనని చెప్పారు. ఒక నెల తన కోసం కష్టపడితే ఐదేళ్లు మీకోసం సేవ చేస్తానని హామీ ఇచ్చారు. తనపై పోటీ చేసిన నాయకులు ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారని, ఇప్పుడు సైతం ఇదే జరుగుతుందన్నారు. రానున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. భూ కబ్జాదారులకు కాంగ్రెస్‌ టికెట్లు ఇస్తున్నదని, దీనిని ప్రజలంతా గుర్తించాలని కోరారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ ఒక్క రూపాయి నిధులు తేలేదని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం రాకముందు కొత్తపల్లి పట్టణం ఎలా ఉండేదో రాష్ట్రం వచ్చాక ఎంత అభివృద్ధి జరిగిందో గమనించాలన్నారు..ఎన్నికల వేళ కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మాయమాటలకు మోసపోవద్దన్నారు. అమలు కానీ హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేక చేతులేత్తేసిందన్నారు. తనను మళ్లీ గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ది చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.

Also Read: BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన యునైటెడ్ ముస్లిం ఫోరం