Site icon HashtagU Telugu

TS Transgenders: ‘ట్రాన్స్ జెండర్ల’కు ఆసరా పింఛన్లు ఇవ్వండి!

Transgender

Transgender

తెలంగాణలో ఉంటున్న ట్రాన్స్ జెండర్లకు పింఛన్లు ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అర్హులైన ట్రాన్స్‌జెండర్లకు ఆసరా పింఛన్లు, ఇతర ప్రయోజనాలను మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని, జీఓ 17ను అప్‌డేట్ చేయాలని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వైజయంతి వసంత మొగ్లీ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించారు. ఆహార భద్రత కార్డులు, మందులు, హెచ్‌ఐవి, హార్మోన్ చికిత్స వంటి అనేక విషయాలను పిటిషనర్ అభ్యర్థించారు.

కోవిడ్-19 పీక్‌గా ఉన్న సమయంలో సమర్పించిన PIL, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక టీకా కేంద్రాలను, అలాగే ఉచిత ఆహారం/రేషన్లను కూడా కోరింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జయనా కొఠారి వాదనలు వినిపించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం, పిటిషన్‌ దాఖలు చేసే సమయానికి రాష్ట్రంలో దాదాపు 58,000 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని, దాదాపు 12,000 మందికి వ్యాక్సిన్‌ వేయించారని తెలిపారు.

కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేశామని, తెలంగాణలోనూ అలాంటి పథకాలు అమలు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లు 2BHK ఇళ్లు, వృద్ధాప్య పింఛన్లు మొదలైన వివిధ కార్యక్రమాల నుండి లబ్ధి పొందేందుకు వీలుగా వారికి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను జారీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది కోర్టును కోరారు.