Site icon HashtagU Telugu

Uttam Kumar Reddy : కాళేశ్వరం అప్పుల పర్యవసానం.. మేడిగడ్డలో చట్ట విరుద్ధ నిర్మాణం: మంత్రి ఉత్తమ్‌ సంచలన ఆరోపణలు

Consequences of Kaleshwaram debts.. Illegal construction in Medigadda: Minister Uttam makes sensational allegations

Consequences of Kaleshwaram debts.. Illegal construction in Medigadda: Minister Uttam makes sensational allegations

Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం అధిక వడ్డీలతో రూ.84,000 కోట్ల అప్పు తెచ్చిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచే అనేక అవకతవకలు జరిగాయని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద రూ.38,000 కోట్లతో నిర్మించాల్సిన ప్రాజెక్టును అనవసరంగా మేడిగడ్డకు మార్చారని పేర్కొన్నారు. భారీ అప్పులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పాలనలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్‌పై న్యాయ విచారణ జరిపిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాం. రాజకీయ హంగులు జోడించకుండా న్యాయపరంగా సమగ్రంగా విచారించాల్సిందిగా కమిషన్‌కు సూచించాం. కమిషన్‌ 660 పేజీల నివేదికను నీటిపారుదల శాఖకు ఇచ్చింది. ఆ నివేదికను అధికారులు కేవలం 25 పేజీలకు సంక్షిప్తం చేశారు అని మంత్రి వివరించారు.

Read Also: New Liquor Policy: మద్యం విధానంతో రూ. 700 కోట్ల ఆదాయం.. కొత్త‌ పాలసీలపై సీఎం సమీక్ష!

2016లో మేడిగడ్డ ఒప్పందం జరిగిందని, 2019లో ప్రాజెక్టు ప్రారంభమై 2023లో బ్యారేజ్ కుంగిపోయిందని గుర్తుచేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ప్రకారం, మేడిగడ్డ నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్‌లో పలు లోపాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇదే విధంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ నీటి నిల్వ సాధ్యపడదని కమిటీ తెలిపిందని పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ప్రకారం, తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవన్న అప్పటి సీఎం కేసీఆర్‌ తీర్పు తప్పుడు మోసపూరితమని తేలింది. అక్కడ తగినంత నీరు ఉందని అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. కేంద్రం కూడా 70 శాతం నికర నీటి లభ్యత ఆధారంగా హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని లేఖ ద్వారా వెల్లడించింది. అయినా కేంద్ర ఆమోదాన్ని కొట్టిపారేసి రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూరితంగా నీటి లభ్యత లేదని లేఖ రాసింది అని మంత్రి ఉత్తమ్‌ ఆరోపించారు.

ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కీలక నిర్ణయాలు అప్పటి క్యాబినెట్‌ సమావేశంలో చర్చించకుండా, ఒక్క సీఎం నోటిమాటపై కాంట్రాక్టులు ఇచ్చినట్లు ఆరోపించారు. ప్రజాధనం కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు విలువలు పెంచారు. మేడిగడ్డ నిర్మాణానికి జారీ చేసిన జీవోలు (G.O No. 230, 231) చట్టబద్ధంగా లేవు. ఈ నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం పొందకుండా తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధం. ఇంత పెద్ద ప్రాజెక్టు కోసం తప్పనిసరిగా క్యాబినెట్‌ ఆమోదం అవసరం. కానీ తగిన ప్రామాణికాలేవీ పాటించలేదు అని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో అప్పటి సీఎం కేసీఆర్‌కు ప్రత్యక్ష బాధ్యత ఉందని కమిటీ స్పష్టంగా పేర్కొందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మేడిగడ్డ వద్ద బ్యారేజ్‌ నిర్మాణాన్ని సిఫార్సు చేసిన నిపుణుల కమిటీ నివేదికను కూడా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అనేక అవకతవకలను వెలుగులోకి తెచ్చాయి. రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించారన్న దానిపై సమగ్ర విచారణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Heavy rain : హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నగరమంతా జలమయం, ట్రాఫిక్‌కు బ్రేక్