Site icon HashtagU Telugu

Youth Congress War Room: తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటి దొంగలు

Uttam Kumar

Uttam Kumar

Youth Congress War Room: తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. ఇన్నాళ్లు సీనియర్, జూనియర్ పంతాలకు పోయి ప్రజల్లో చులకన అయ్యారు. నిన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని పీసీసీ చీప్ చేయడం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు మింగుడుపడలేదు. దీంతో రేవంత్ ని ఒంటరి చేసి సీనియర్లంతా ఏకమై పలుమార్లు ఢిల్లీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఢిల్లీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి.

గత కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ల్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ కురువృద్ధుడు జానారెడ్డి, హనుమంతరావు, జగ్గారెడ్డి ఇలా సీనియర్లపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు వెలిశాయి. ముందుగా అధికార పార్టీ చేస్తుందనుకున్నారు. కానీ ఈ మధ్య ఉత్తమ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ట్రోల్స్ కి పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టారు. చివరికి తెలిసిందేంటంటే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లపై ట్రోల్స్ జరుగుతుంది సొంత పార్టీ వార్ రూమ్ నుంచే. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.

ఉత్తమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ నుంచి ఈ ట్రోల్స్ నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. లోతుగా విచారించగా సదరు అపార్ట్మెంట్ యూత్ కాంగ్రెస్ పేరుపై ఉన్నట్టు గుర్తించారు. దీంతో సోమవారం రాత్రి సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సొంత పార్టీ నేతలపై ట్రోలింగ్ జరుగుతుండటం తెలంగాణ కాంగ్రెస్‌లో కలవరపాటు మొదలైంది. కాగా.. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ ఛార్జ్ ప్రశాంత్ పై వేటు వేసింది. ప్రశాంత్ విచారణకు హాజరు కావాల్సిందిగా సైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Read More: Arjun Tendulkar: కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్.. ప్రస్తుత పరిస్థితి ఇదే?