Site icon HashtagU Telugu

Yellareddy Politics: ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ జోరు.. ప్రజల మద్దతు హుషారు

Yellareddy Politics

New Web Story Copy 2023 09 10t132845.850

Yellareddy Politics: తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇక్కడ కాంగ్రెస్ బలహీనంగా కనిపించింది. కర్ణాటక ఎన్నికల తరువాత పరిస్థితులు మారాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంది. కర్ణాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బలమైన క్యాడర్ గా అవతరించింది. తెలంగాణాలో ఖమ్మం తరువాత ఎల్లారెడ్డి పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతాయి. చుట్టు ప్రక్కల నియోజకవర్గాల్లో అధికార పార్టీ మీసం మెలేసినా, ఎల్లారెడ్డిలో మాత్రం పరిస్థితి బిన్నం. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడుతుంటారు. ఇక ఎల్లారెడ్డి ఆంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు మదన్ మోహన్ రావు(Madan Mohan Rao).

ఉమ్మడి నిజామాబాద్(Nizamabad) జిల్లాలో రాజకీయం అంతా ఒక ఎత్తు.. ఎల్లారెడ్డి అసెంబ్లీ పాలిటిక్స్ మరో ఎత్తు. విలక్షణ తీర్పుతో ప్రత్యేకత చాటుకునే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఊహించని మలుపులే ఎక్కువగా కనిపిస్తాయి..కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ స్థానంలో గత ఎన్నికల్లో హస్తం పార్టీ సత్తా చాటింది. ఆ విజయం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. హస్తం గుర్తుపై గెలిచిన జాజుల సురేందర్ పార్టీకి హ్యాండిచ్చి గులాబీ గూటికి చేరిపోయారు. హ్యాండిచ్చిన ఎమ్మెల్యేపై ప్రతీకారంతో కాంగ్రెస్ రగిలిపోతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆ సెగ్మెంట్ హస్తం చేసుకోవాలని భావిస్తుంది. వాస్తవానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కారు జోరు చూపింది. జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే 8 స్థానాల్లో బీఆర్ఎస్ కాలర్ ఎగరేసింది. కానీ, ఎల్లారెడ్డిలో కారు టైర్ పేలింది. అక్కడ కారు స్పీడ్ పనిచేయలేదు. ఎందుకంటే ఆ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. ఆ నమ్మకంతోనే ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జాజుల సురేందర్ ను భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపారు.35 వేల 148 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం ఈ ఇద్దరూ చెరో పార్టీకి జంప్ అయ్యారు. సురేందర్ గులాబీ గూటికి చేరితే రవీందర్ బీజేపీ తీర్ధం పుచుకున్నాడు .

2019 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన బీబీ పాటిల్ కు చివరి వరకు ముచ్చెమటలు పట్టించారు. తన ఓటమికి కారెక్కిన జాజుల సురేందర్ కారణమని ఓ వర్గం భావిస్తుంది. జాజుల సురేందర్ కారెక్కడంతో తన అనుచర వర్గం తన వెంటే వెళ్ళింది. దీంతో ఓట్లు చీలిపోయాయి. ఈ కారణంగా మదన్ మోహన్ రావు గెలుపు తృటిలో మిస్ అయింది. లేకపోతే మదన్ మోహన్ రావు ఎంపీ కావడం ఖాయంగా జరిగేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

మదన్ మోహన్ రావుకు కాంగ్రెస్ పెద్దలతో మంచి పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతోనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాను అనుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ను ఎలాగైనా సాధిస్తానని చాలా ధీమాగా ఉన్నారు. మదన్ మోహన్ రావు ఏ స్థానం నుంచి పోటీకి దిగినా ప్రత్యర్థులకు మాత్రం ఈసారి ముచ్చెమటలు ఖాయం. అంత పక్కా ప్లానింగ్ తో స్కెచ్ వేసుకుంటున్నారని టాక్. సో మొత్తంగా చూస్తే ఎల్లారెడ్డిలో అధికార బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఇప్పటికే సురేందర్ ప్రజల్లో పట్టు కోల్పోయాడు. బీజేపీ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ రావు బలమైన అభ్యర్ధులుగా ఉన్నారు. వీరిద్దరిలో ప్రజల మద్దతుని కూడగట్టడంలో ముందున్నాడు మదన్ మోహన్ రావు. పైగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆయన యువత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. జాబ్ మేళాలు నిర్వహించి ఉదారతను చాటుకున్నారు. గడప గడప కార్యక్రమం నిర్వహించి ప్రజాక్షేత్రంలో ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

గత ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైనప్పటికీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోలేదు.ప్రస్తుతం ఆయన ఎల్లారెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎల్లారెడ్డి టికెట్ ని దక్కించుకోవాలని మరో కీలక నేత బరిలో ఉన్నాడు. ఆయనే సుభాష్ రెడ్డి(Subhash Reddy). సదరు నియోజకవర్గంలో సుభాష్‌రెడ్డి, మదన్ మోహన్ రావు మధ్య టికెట్ వార్ అయితే నడుస్తుంది. సుభాష్ రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్ని నమ్ముకున్నారు. కానీ మధుసూదన్ రావుకి ఢిల్లీ స్థాయిలో సపోర్ట్ ఉంది. తాజాగా జరిగిన కేటాయింపుల్లో ఏఐసీసీ అతన్ని గుర్తించి కమ్యూనికేషన్స్ కమిటీ వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది.ఈ మధ్య కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదేనంటూ కొందరి పేర్లు ప్రముఖంగా హైలెట్ అయ్యాయి. అందులో మదన్ మోహన్ రావు పేరు కూడా ఉంది. తాజా సర్వేలు కూడా అతనికి అనుకూలంగా వచ్చాయి. ఇంటర్నల్ సర్వేలు, థర్డ్ పార్టీ సర్వేలలో మదన్ మోహన్ కి మంచి మార్కులే పడ్డాయి. హ్యాష్ ట్యాగ్ మీడియా చేపట్టిన పబ్లిక్ పోల్స్ లో ప్రజలు మదన్ మోహన్ రావుకు ఓటేశారు. దీని ఫలితం 2024 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి ఆయన ప్రస్థానం మొదలు కాబోతున్నట్టు స్పష్టం అవుతుంది.

Also Read: AP : ప్రజాక్షేత్రంలోకి నారా బ్రాహ్మణి..భువనేశ్వరి..?