Site icon HashtagU Telugu

Rahul Visit: నిరుద్యోగ ఎమర్జెన్సీ.. ఓయూకు రాహుల్!

Rahulgandhi

Rahulgandhi

మే 7న ఉస్మానియా యూనివర్సిటీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన చేస్తారని, నిరుద్యోగులకు భరోసా కల్పిస్తారని, కాంగ్రెస్ క్యాడర్‌ లో సైతం కొత్త ఉత్సాహం నింపేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని ఏఐసీసీ (తెలంగాణ) ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ అన్నారు. నిరుద్యోగుల సమస్యల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ట్విట్టర్ వేదికగా ఠాగూర్ ప్రశ్నించారు. చంద్రశేఖర్ గారు “ఎన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా ఆపగలరు? మీ కొడుకు పట్ల వ్యవహరిస్తున్నట్టుగానే, తెలంగాణా బిడ్డల పట్ల వ్యవహరించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఉద్యోగాలు సృష్టిస్తున్నామని విద్యార్థులు, నిరుద్యోగులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, నిరుద్యోగ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రైవేట్ ఉద్యోగాలు, స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సరైన యంత్రాంగం ఉందా?  ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంటే, మరోవైపు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడం ఎలా సాధ్యమవుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బిస్వాల్ కమిటీ 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలను గుర్తించగా, అందులో సగానికి తక్కువ కాకుండానే కేసీఆర్ ప్రకటన చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ‘నిరుద్యోగ ఎమర్జెన్సీ’ని పరిగణనలోకి తీసుకోవాలని గతంలో ప్రభుత్వాన్ని కోరిన ఆయన, రాహుల్ పర్యటన నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోతుందనీ, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశంతోనే యువత ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారని శ్రవణ్ స్పష్టం చేశారు.

కాగా మే 7న రాహుల్ గాంధీ పర్యటనకు సీనియర్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గాంధీ కుటుంబం పట్ల తమకున్న విధేయతను నిరూపించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా ముందుకు సాగుతూ, పార్టీలో అంతర్గత విభేదాలన్నీ సద్దుమణిగినట్లు గా వ్యవహరిస్తున్నారు. ‘‘రాహుల్ కార్యక్రమానికి వీసీ అనుమతి కోసం నేడు సోమవారం ఓయూకి వస్తున్నాం. ఓయూ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలను ఎవరూ మరిచిపోలేరని’’ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ పర్యటనను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కోరారు. రాహుల్ గాంధీ పర్యటనను పార్టీ శ్రేణులందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు