దూసుకుపోతున్న టీఆర్ఎస్, బీజేపీ.. అభ్యర్థి వేటలో కాంగ్రెస్..!

హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:34 PM IST

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటల టీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలిన నాటి నుంచి హుజూరాబాద్ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్లు పోడీ పడుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వరుస పాదయాత్ర చేస్తూ ఓటర్లను ఆకర్షితే.. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ దళిత బంధును ప్రకటించి ఇతర పార్టీలకు సవాల్ విసిరాయి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థి వేటలో ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం దరఖాస్తులను స్వీకరించినప్పటికీ, అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. మొత్తం 18 మందినుంచి దరఖాస్తులను స్వీకరించినట్టు తెలుస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీని కొట్టాలంటే బలమైన ప్రత్యర్థి ఉంటేనే సాధ్యమని భావిస్తున్నాయి. దీంతో టీకాంగ్రెస్ కొండా సురేఖ వైపు మొగ్గుచూపినప్పటికీ, ఆమె షరత్తులు విధించినట్టు, తనకు అనుకూలమైన వరంగల్ స్థానాన్ని విడిచిపెట్టే ఉద్దేశం లేదనే వార్తలు వినిపించాయి. దీంతో కవ్వంపల్లి సత్యనారాయణ, పట్టి శ్రీధర్ రెడ్డి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఈ ఇద్దరు టీఆర్ఎస్ చరీష్మా ముందు నిలుస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

హుజూరాబాద్ కు నోటిఫికేషన్ వెలువడటంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ చార్జి ఠాగూర్ త్వరలోనే పీసీసీతో సమావేశం కానున్నారు. రేపో, మాపో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయి. అటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్నాయని, అధికారం అడ్డంపెట్టుకొని జిమ్ముక్కులు చేస్తున్నారని, మిలటరీ బలగాలతో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.