Site icon HashtagU Telugu

KCR: కాంగ్రెస్ పాలన దారి తప్పింది: రేవంత్ పై కేసీఆర్ ఫైర్

KCR Comments

KCR Comments

KCR: తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏండ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుని తిరిగి స్వయంపాలన అనే గమనంలో దేశానికే ఆదర్శవంతమైన పాలననందిస్తూ స్వరాష్ట్రంగా పదేండ్ల అనతికాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకున్నదని, ఉద్యమం తో పాటు పాలనలో తెలంగాణ కోసం సాగిన తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సివున్నదని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆరు దశాబ్దాలపాటు దిక్కు మొక్కు లేక ఒక అదెరువు లేక కొట్టుమిట్టాడిన తెలంగాణ ను దరికి చేర్చేందుకు నాడు ఉద్యమ కేతనమై ఎగిరిన గులాబీ జెండా రెప రెపలు., తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసె దాకా, కాంగ్రేస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమైతున్న తెలంగాణ ను అక్కున చేర్చుకుని మల్లా గాడిలో పెట్టేదాకా, కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘటించారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ…” తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన. అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు..” అని పునరుద్ఘటించారు.

“తెలంగాణ సాధించేనాటికి మనది సమైక్యపాలనలో దిక్కు మొక్కు లేని పరిస్థితి. సాగునీరు తాగునీరు కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకున్నాం. తీర్చిదిద్దుకున్నాం. పదేండ్ల అనతికాలం లోనే తెలంగాణ లో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం. ఇటువంటి కీలక సమయం లో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు. కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్ర లోకి వెళితే అర్థమౌద్ది. కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారు. “పాలిచ్చే బర్రెను వొదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది” అని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారు” అని కేసీఆర్ వివరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్, రైతు బంధు అందట్లేవన్నారు. తాగునీరు, సాగునీరు,విద్యుత్ సరఫరా కాట్లేవన్నారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో రికార్డ్ అవుతున్నాయని తెలిపారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రేస్ పాలనలో దారి తప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.