Site icon HashtagU Telugu

Lok Sabha Elections 2024: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఏ దిక్కా..?

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెల వరకు సైలెంట్ మోడ్ లో ఉన్న నేతలు లోకసభ ఎన్నికలకు ముందు కారు పార్టీని వీడుతున్నారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు. అందుల ఓ భాగంగా ఏఐసీసీ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చాలా వరకు బీఆర్ఎస్ నుండి వచ్చిన నేతలకే టికెట్లు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుత కాంగ్రెస్ నేతల కంటే బీఆర్‌ఎస్‌కు చెందిన వారికే సీటు దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ భావించినట్లు సమాచారం. టీపీసీసీ ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ మంగళవారం న్యూఢిల్లీలో సమావేశమైంది.

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించి లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కే అవకాశం ఉన్న నేతల జాబితాలో చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, పట్నం సునీత మహేందర్‌రెడ్డి (మల్కాజిగిరి), దానం నాగేందర్‌ (సికింద్రాబాద్‌), పసునూరి దయాకర్‌ (వరంగల్‌) ఉన్నారు. వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నియమితులైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చేయాలని భావించి కాంగ్రెస్‌లో చేరారు. కానీ రంజిత్ రెడ్డి చేరికతో ఆ వ్యూహం ఫలించేలా లేదు.

మల్కాజిగిరి అభ్యర్థిగా సునీతను ప్రకటించే అవకాశం ఉన్నందున, ఈ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఇది మింగుడుపడటం లేదు. అదేవిధంగా సికింద్రాబాద్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు అన్ని సన్నాహాలు చేసిన హైదరాబాద్‌ మాజీ మేయర్‌, బీఆర్‌ఎస్‌ నేత బొంతు రామ్‌మోహన్‌ ఆశలకు కూడా దానం నాగేందర్‌ ఫిరాయింపు తెరపడింది.

ఈ జాబితాతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భార్యకు బదులు భువనగిరి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలా శేఖర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా వరంగల్‌లో రెండుసార్లు లోక్‌సభ స్థానానికి గెలిచిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు బీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించినందున ఆయనకు టిక్కెట్ ఇవ్వవచ్చు. ఇది కాకుండా, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో పనిచేస్తున్న బిజెపి నాయకురాలు డాక్టర్ నైతం సుమలతకు ఆదిలాబాద్ లోక్‌సభ సీటును ఆఫర్ చేసే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

గత నెలలో కారు ప్రమాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో మరో ఆరు నెలల్లో జరగనున్న ఉప ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ నారాయణన్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉపఎన్నికకు తననే నిల్చోబెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత వారం మల్కాజిగిరిలో బిజెపి నిర్వహించిన రోడ్ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఆ వెంటనే శ్రీ గణేష్ మాజీ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావులతో రెండు రోజులు చర్చలు జరిపి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.

Also Read: BMW 620d M Sport Signature: భార‌త‌దేశంలో బీఎండ‌బ్ల్యూ 620డీ ఎం స్పోర్ట్ సిగ్నేచ‌ర్ విడుద‌ల‌.. ధ‌ర తెలిస్తే షాకే..!