Site icon HashtagU Telugu

Telangana : బీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ ఆందోళ‌న‌.. ఉచిత విద్యుత్‌పై వార్‌

Congress Hashtag

Congress Hashtag

రైతులకు ఉచిత విద్యుత్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న మోసానికి నిరసనగా వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయ‌కులు విద్యుత్‌ ఉపకేంద్రాల వద్ద ధర్నాలు నిర్వ‌హించారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మంగళ, బుధవారాల్లో నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేవంత్‌ ప్రకటనను బీఆర్‌ఎస్‌ వక్రీకరించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ఎదురుదాడికి దిగారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సోమిడి గ్రామ సమీపంలోని సబ్‌ స్టేషన్‌ వద్ద హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో అధికార బీఆర్‌ఎస్‌ వాస్తవాలను వక్రీకరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు మూడెకరాల లోపు ఉన్నారని, ప్రతి ఒక్కరికీ రోజుకు మూడు గంటల విద్యుత్ అవసరమని రేవంత్ అన్నారని గుర్తు చేశారు. విద్యుత్ సంస్థల నుంచి కమీషన్లు వసూలు చేయడమే లక్ష్యంగా 24 గంటల విద్యుత్ సరఫరా ప్రణాళిక రూపొందించారని రేవంత్ అన్నార‌ని తెలిపారు. ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని నాయిని రాజేంద‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ ప్రాంత విద్యుత్ అవసరాలను తీర్చడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ సమీపంలో కాంగ్రెస్ కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌ను స్థాపించిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాంట్‌లలో ఇంకా విద్యుత్‌ ఉత్పత్తి జరగలేదని డీసీసీ అధ్య‌క్షుడు నాయిని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుదలకు భయపడుతున్న బీఆర్‌ఎస్ రైతుల్లో కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు ప్రచారం చేసిందనన్నారు.