Congress plus Left : కామ్రేడ్ల‌కు మిర్యాల‌గూడ‌, హుస్నాబాద్, మునుగోడు?

కామ్రేడ్ల‌తో కాపురం చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీ (Congress plus Left) సిద్ధ‌మ‌వుతోంది. ఆ క్ర‌మంలో సీనియ‌ర్లు సైతం త్యాగం చేయాల్సి వ‌స్తోంది.

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 03:09 PM IST

కామ్రేడ్ల‌తో కాపురం చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీ (Congress plus Left) సిద్ధ‌మ‌వుతోంది. ఆ క్ర‌మంలో సొంత పార్టీలోని సీనియ‌ర్లు సైతం త్యాగం చేయాల్సి వ‌స్తోంది. ప్ర‌స్తుతం క‌మ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు దిశ‌గా సంప్ర‌దింపులు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో కొలిక్కి రాక‌పోతే ఢిల్లీ వ‌ర‌కు ఈ పొత్తు వ్య‌వ‌హారం వెళ్లే అవ‌కాశం ఉంది. అప్పుడు జాతీయ ఈక్వేష‌న్ లో కామ్రేడ్ల‌కు ప్రాధానం ఇవ్వ‌డానికి కాంగ్రెస్ అధిష్టానం ఏ మాత్రం వెనుకాడ‌దు. గ‌తంలోనూ 2009 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏర్ప‌డిన మ‌హాకూట‌మిలో కామ్రేడ్లు ఢిల్లీ నిర్ణ‌యంతోనే క‌లిశారు. ఆ అనుభ‌వం దృష్ట్యా ఢిల్లీ స్థాయిలోనే న్యాయం జ‌రుగుతుంద‌ని ఎర్ర‌న్న‌లు భావిస్తున్న‌ట్టు వినికిడి.

కామ్రేడ్ల‌తో కాపురం చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీ (Congress plus Left)

తొలి నుంచి న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో క‌మ్యూనిస్ట్ పార్టీలు బలంగా(Congress plus Left)ఉండేవి. ఆ త‌రువాత క‌రీంన‌గ‌ర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రాబ‌ల్యం చూపించేవి. క్ర‌మంగా ఆ పార్టీల బ‌లం త‌గ్గుతూ వ‌చ్చింది. దానికి కార‌ణం లేక‌పోలేదు. జాతీయ‌, ప్రాంతీయ అనే భేదంలేకుండా పొత్తుల‌తో ప‌లు ఎన్నిక‌ల్లో వెళ్లారు. ప్ర‌త్యేక రాష్ట్రం సంద‌ర్భంగా పార్టీ సిద్ధాంతాల‌ను ప‌క్క‌న పెట్టేశారు. స్వ‌ర్గీయ వైఎస్, మాజీ సీఎం చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రులుగా ఉన్న‌ప్పుడు కొంద‌రు క‌మ్యూనిస్ట్ పెద్ద‌లు లోపాయికారులుగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో తోక పార్టీలుగా ఉభ‌య క‌మ్యూనిస్ట్ పార్టీలు మారిపోయాయి. మ‌ళ్లీ పుంజుకోవడానికి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జాక్షేత్రంలో ప‌ట్టులేకుండా పోయింది.

మునుగోడు ఉప ఎన్నిక సంద‌ర్భంగా క‌మ్యూనిస్ట్ ల‌ను కేసీఆర్

ఏ పొత్తుల‌తోనైతే, కామ్రేడ్లు న‌ష్ట‌పోయారో..వాటితోనే తిరిగి (Congress plus Left) పుంజుకోవాల‌ని చూస్తున్నారు. అందుకే, ఈసారి లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో ర్యాలీ అయ్యాయి. రాష్ట్ర స్థాయిలోనూ అదే త‌ర‌హా పొత్తులు ఉంటాయ‌ని అంద‌రూ భావించారు. కానీ, మునుగోడు ఉప ఎన్నిక సంద‌ర్భంగా క‌మ్యూనిస్ట్ ల‌ను కేసీఆర్ ఆక‌ర్షించారు. కాంగ్రెస్ పార్టీని కాద‌ని బీఆర్ఎస్ పార్టీ వైపు పంచ‌న చేరారు. తీరా, ఎన్నిక ముగిసిన త‌రువాత తూచ్ అంటూ కామ్రేడ్ల‌కు జ‌ల‌క్ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరాటానికి సిద్ధ‌ప‌డ్డారు. దీంతో ఖంగుతిన్న కామ్రేడ్లు కాంగ్రెస్ పంచ‌న చేర‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. అయితే, సీట్ల విష‌యంలో రాజీప‌డే ప‌రిస్థితి లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌రిగ్గా, ఇక్క‌డే కాంగ్రెస్ సీనియ‌ర్లు సైతం త్యాగానికి సిద్ధం కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది.

రెండు సీపీఐ, ఒక‌టి సీపీఎం కు ఇవ్వ‌డానికి కాంగ్రెస్

అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం ఉభ‌య క‌మ్యూనిస్ట్ పార్టీలు ఆరు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయ‌డానికి స‌న్న‌ద్ధం అయ్యాయి. ఆ మేర‌కు తొలి విడ‌త చ‌ర్చ‌ల్లో ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. వాటిలో ప్ర‌ధానంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి బెల్లంపల్లి, క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి హుస్నాబాద్, ఖ‌మ్మం జిల్లా ప‌రిధిలోని కొత్త‌గూడెం, పాలేరు. మిర్యాల‌గూడ , న‌ల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌కవ‌ర్గాలు అడుగుతున్నారు. ప్ర‌ధానంగా సీపీఐ పార్టీ హుస్నాబాద్ ,బెల్లంప‌ల్లి, మునుగోడు, కొత్త‌గూడెం స్థానాల‌ను అడుతోంది. ఇక సీపీఎం పాలేరు, మిర్యాల‌గూడ స్థానాల‌ను ఆశిస్తోంది. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రెండు సీపీఐ, ఒక‌టి సీపీఎం కు ఇవ్వ‌డానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్న‌ట్టు వినికిడి. వీటితో పాటు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి ఇవ్వ‌డానికి రెడీగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఇలాంటి ప‌రిస్థితుల్లో మిర్యాల‌గూడ‌ను సీపీఎం వ‌దులుకునే ప‌రిస్థితి లేదు. అలాగే, హుస్నాబాద్, మ‌నుగోడును సీపీఐ విడిచిపెట్ట‌కుండా (Congress plus Left) పోటీ చేయాల‌ని భావిస్తోంది.

Also Read : Telangana Congress : కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తు కు రంగం సిద్ధం

ఒక వేళ క‌మ్యూనిస్ట్ ల డిమాండ్ ప్ర‌కారం ఢిల్లీ కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకుంటే మిర్యాల‌గూడ‌, హుస్నాబాద్ ను కాంగ్రెస్ త్యాగం చేయాలి. అప్పుడు జానారెడ్డి కుమారుల్లోని ఒక‌రికి స్థానం లేకుండా పోతుంది. అలాగే, మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ హుస్నాబాద్ ను త్యాగం చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి. మూడోస్థానం కూడా ఇవ్వ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో మునుగోడును కామ్రేడ్ల‌కు ఇవ్వాలి. కానీ, అక్క‌డ నుంచి పోటీ చేయ‌డానికి ఇప్ప‌టికే చ‌ల‌మ‌ల కృష్ణారెడ్డి పాద‌యాత్ర చేస్తున్నారు. మ‌రో వైపు ఉప ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిపోయిన పాల్వాయి స్ర‌వంతి టిక్కెట్ ఆశిస్తూ అధిష్టానం వ‌ద్ద లాబీయింగ్ చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కామ్రేడ్ల‌కు ఆ స్థానాన్ని కేటాయిస్తే ఇద్ద‌రూ త్యాగం చేయాల్సి ఉంటుంది. లేదంటే, కొత్త‌గూడెం త‌ప్ప‌క ఇవ్వాల్సి ఉంటుంది. కామ్రేడ్లతో పొత్తు తెర‌మీద‌కు వ‌చ్చిన మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల కంటే మిర్యాల‌గూడ‌, హుస్నాబాద్, మునుగోడు స్థానాల్లో టిక్కెట్లు ఆశిస్తోన్న కాంగ్రెస్ నేత‌ల్లో ఆందోళ‌న మొద‌ల‌యింది.

Also Read : Mulugu Congress : ములుగులో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..