Komatireddy Venkatreddy : `కోమ‌టిరెడ్డి`కి పొమ్మ‌న‌లేక పొగ‌!

తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్య‌వహారంపై అధిష్టానం సీరియ‌స్ గా ఉంది. ఆయ‌న వాల‌కాన్ని క్లోజ్ గా ఏఐసీసీ కార్య‌ద‌ర్శులు రోహిత్ చౌద‌రి, జావేద్ లు ప‌రిశీలిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 04:30 PM IST

తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్య‌వహారంపై అధిష్టానం సీరియ‌స్ గా ఉంది. ఆయ‌న వాల‌కాన్ని క్లోజ్ గా ఏఐసీసీ కార్య‌ద‌ర్శులు రోహిత్ చౌద‌రి, జావేద్ లు ప‌రిశీలిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ ఠాకూర్ తో వాళ్లిద్ద‌రు మంగ‌ళ‌వారం సాయంత్రం భేటీ కానున్నారు. సీనియ‌ర్ల‌తో బ‌స్సు యాత్ర‌ను చేయించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మునుగోడు ఎన్నిక‌ల గురించి కాంగ్రెస్ ప‌క్షాన నిలిచేలా మాట్లాడ‌లేదు. పైగా త‌మ్ముడు రాజ‌గోపాల్ రెడ్డితో పాటుగా ఆయ‌న కూడా బీజేపీలోకి వెళ‌తార‌ని టాక్ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా స్పీక‌ర్ ఆమోదించ‌డానికి ముందే మునుగోడు వేదిక‌గా పీసీసీ స‌భ‌ను పెట్టింది. ఆ స‌భ‌కు మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్, జానా రెడ్డి, భ‌ట్టీ త‌దిత‌రులు అంద‌రూ హాజ‌రు అయ్యారు. కానీ, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. ఆ రోజు నుంచి ఆయ‌న బీజేపీలోకి వెళ‌బోతున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

మునుగోడు కాంగ్రెస్ స‌భ‌లో వెంక‌ట‌రెడ్డిని పీసీసీ అధికార ప్ర‌తినిధి అద్దంకి ద‌యాక‌ర్ బూతులు తిట్టారు. ఆ విష‌యాన్ని ఏక‌రువు పెడుతూ మీడియా ముందుకు వెంక‌ట‌రెడ్డి వ‌చ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటల‌ను, అద్దంకి ద‌యాక‌ర్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబడుతూ బేష‌ర‌తు క్ష‌మాప‌ణ కోరారు. వెంట‌నే స్పందించిన అద్దంకి ద‌యాక‌ర్ బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పారు. ఆ మరుస‌టి రోజు రేవంత్ రెడ్డి కూడా క్ష‌మాప‌ణ చెబుతూ వీడియో విడుద‌ల చేశారు. కానీ, సంతృప్తి చెంద‌ని వెంక‌ట‌రెడ్డి మ‌రిన్ని డిమాండ్ల‌ను ముందుంచారు. శాశ్వ‌తంగా ద‌యాక‌ర్ ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని కోరారు. అంతేకాదు, రేవంత్ వాల‌కాన్ని త‌ప్పుబడుతూ మునుగోడు కాంగ్రెస్ కు దూరంగా ఉన్నారు.

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేయాల‌ని రేవంత్ పిలుపునిచ్చారు. ఆ విష‌యాన్ని వెంక‌ట‌రెడ్డికి తెలియ‌చేయ‌లేదు. ఆ పాద‌యాత్ర‌ను లీడ్ చేయాల్సిన రేవంత్ రెడ్డికి క‌రోనా రావ‌డంతో దూరంగా ఉన్నారు. మిగిలిన సీనియ‌ర్లు కూడా పాద‌యాత్ర‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఎవ‌రివారే య‌మునాతీరే అనే రీతిగా మునుగోడు కాంగ్రెస్ వ్య‌వ‌హారం ఉంది. దీంతో ఏఐసీసీ ఇద్ద‌రు దూత‌ల‌ను(రోహిత్ చౌద‌రి, ఆజాద్‌) తెలంగాణ‌కు పంపింది. అంతేకాదు, తెలంగాణ ఇంచార్జి బాధ్య‌త‌ల‌ను ప్రియాంక‌గాంధీకి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఫ‌లితంగా రేవంత్ రెడ్డి , మాణిక్ ఠాకూర్, సునీల్ క‌నుగోలు టీమ్ కు క‌ళ్లెం వేసిన‌ట్టు అయింది.

గ‌త రెండు రోజులుగా వెంక‌ట‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తోన్న దూత‌లు వాస్త‌వాల‌ను గ్ర‌హించే ప‌నిలో ఉన్నారు. పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ వెంక‌ట‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మునుగోడు కేంద్రంగా మ‌ద్ధ‌తు ప‌లికే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. అందుకే, ఆయ‌న వాల‌కంపై అధ్య‌యనం చేస్తున్నారు. పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టేలా వ్యూహాల‌ను ర‌చిస్తున్నార‌ని తెలిసింది. అందుకోసం మంగ‌ళ‌వారం సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ ఠాకూర్ తో ఇద్ద‌రు దూత‌లు కీల‌క స‌మావేశం నిర్వ‌హించబోతున్నారు. వాళ్లిద్ద‌రూ సోమ‌వారంనాడు ఉత్త‌మ్, విష్ణు, ష‌భ్బీర్ ఆలీతో స‌మావేశం అయ్యారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఉన్న వెంక‌ట‌రెడ్డి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా మాణిక్ ఠాకూర్ తో స‌మావేశం కానున్నార‌ని తెలిసింది. మొత్తం మీద వెంక‌ట‌రెడ్డి కాంగ్రెస్సు ఎక్క‌డ‌మా? లేక వెళ్లిపోవ‌డ‌మా? అనేది క్లైమాక్స్ కు చేరింద‌న్న‌మాట‌.