Site icon HashtagU Telugu

Congress Party: పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు

Congress Party

Congress Party

Congress Party: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి (Congress Party) అత్యంత ప్రతిష్టాత్మకమైనవని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో క్యాడర్ ను లీడర్ ను అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయానికి రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులకు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల‌కు పార్టీ యంత్రాంగానికి సూచించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా వ్యహరిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సోమవారం రోజు నామినేషన్ వేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంగళవారం ఉదయం ఆ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్‌ల‌తోపాటు శాసనమండ‌లి సభ్యులు టి.జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్, వెలిచాల రాజేందర్ రావు, మేడిపల్లి సత్యం, వడితేల ప్రణవ్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కల వేణుగోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: IPL 2025 Schedule: ఐపీఎల్ అభిమానుల‌కు క్రేజీ న్యూస్‌.. వ‌చ్చే వారం షెడ్యూల్ విడుద‌ల‌?

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయన్నారు. ఈ ఎన్నికల ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మ్రోగించేందుకు దోహదపడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలలో ప్రతీ ఓటు కీలకంగా మారుతుందని క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేయగలిగితే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందన్నారు.

తద్వారా రేపటి స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో సైతం పార్టీ గెలుపుకు మార్గం సునాయసనం అవుతుందన్నారు. అంతే గాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం కలిగిన వారిని ప్రోత్సాహం కల్పించడం ద్వారా ఇటు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయభేరి మ్రోగించడానికి సులభతరం అవుతుంద‌న్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రభుత్వం సాధించిన విజయాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం వ్యవధిలోనే జరిగిన ఉపాధ్యాయ నియామకాలు మొదలు ప్రభుత్వం భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యగాల నియామకాలను విద్యార్థి, యువతకు వివరించాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం పరంగా సనస్యలు తన దృష్టికి తీసుక రాగలిగితే సత్వరం పరిష్కరించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇన్ఛార్ మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులకు, పార్టీ యంత్రాంగానికి నిరంతరం అందుబాటులో ఉంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.