Telangana State : అప్పుల్లో సంపన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ ఎదురు దాడి..

తెలంగాణ రాష్ట్రమే (Telangana State) అధోగతిలో పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.

  • Written By:
  • Updated On - December 14, 2023 / 01:42 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Telangana State Rich in Debt : అధికారంలో ఉన్నంతకాలం ఎన్నో డాంబికాలు పోయింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం చీకటి పాలవుతుందని, కరెంటు ఉండదని, తాము అమలు చేస్తున్న పథకాలు మాయమైపోతాయని, మొత్తం తెలంగాణ రాష్ట్రమే (Telangana State) అధోగతిలో పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా రెండు దఫాలు అధికారం కట్టబెట్టి మూడోసారి మాత్రం వారికి అవకాశం ఇవ్వకూడదని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని అధికార పీఠంపై నిలబెట్టారు. ప్రజల తీర్పు ఎవరికైనా శిరసావహించాల్సిందే. కాకుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. అలా తమ వాగ్దానాలను, ప్రకటించిన పథకాలను అమలు చేయడానికి తగినన్ని నిధులు అందుబాటులో ఉండాలి. కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తొలి రోజు నుంచే తాము చేసిన వాగ్దానాల అమలు కోసం అడుగులు ముందుకు వేయడం ప్రారంభించింది.

మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభమైంది. రైతులకు భరోసాగా ఇచ్చే నగదును వారి అకౌంట్లో జమ చేసే కార్యక్రమం మొదలైంది. రుణమాఫీ మీద చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. ఇదంతా ఒక పార్శ్వం అయితే రాష్ట్రంలో (Telangana State) ఏ రంగాన్ని చూసినా అంతా అయోమయంగా అప్పుల లోయలో కూరుకుపోయిన స్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు వాగ్దానాలను అమలు చేయడానికి తగిన నిధులు సమకూర్చుకోవాలి, ఇటు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం (Telangana State) మళ్లీ జవసత్వాలు పుంజుకునే మార్గాలు అన్వేషించాలి. ఆ దిశగా అడుగులు వేయడానికి అడుగడుగునా ఎన్నో అవరోధాలు ఎదురవడం తొలిరోజు నుంచే మొదలైంది.

We’re now on WhatsApp. Click to Join.

కేవలం విద్యుత్ శాఖలోనే వేలాది కోట్లు అప్పులు పేరుకుపోయినట్లు తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థమైంది. సమావేశానికి హాజరుకాకుండా జెన్కో, ట్రాన్స్కో సీఎం డి రాజీనామా నాటకాన్ని రచించిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. ప్రతి శాఖలో, ధరణి పోర్టల్ విషయంలో, కాలేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణంలో, రింగురోడ్డు, శంషాబాద్ మెట్రో రైల్ మార్గం మొదలైన పలు ప్రాజెక్టుల లో జరిగిన అవకతవకలు, అవినీతి ఇప్పుడిప్పుడే కలుగు నుంచి ఎలకల్లా బయటపడుతున్నాయి. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్ల కాలంలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి, అవకతవకలపై కమిటీలు వేసి నిజనిర్ధారణ చేసి దోషులను బోనులో నిలబెట్టే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం నెత్తిమీద ఉంది. ఎన్ని లోపాలు ఉన్నా, ఎన్ని అప్పులు ఉన్నా, ఎంత అదోగతిలో రాష్ట్రం ఉన్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకొని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.

ఇన్ని బాధ్యతలతో కొత్త ప్రభుత్వం తలమునకలవుతుంటే, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు అవినీతి ఆరోపణలు ఎక్కడ ఎదుర్కొంటామో.. ఎక్కడ ఇరుక్కుపోతామో అని భయపడుతూ ఎదురుదాడికి దిగినట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయాలని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఆ విషయం ఏమైంది అని, రాహుల్ గాంధీ చేసిన ఆరు గ్యారెంటీల మాట ఏమైందని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు మొదలు పెట్టారు. రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలోని నిధులు, ఆర్థిక వనరులు మొదలైన విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా ముందు చూపు లేకుండా వాగ్దానాలు చేశారని, ఇలాంటి వాగ్దానాలు అమలు చేయడం తల మీద ఎంత బరువు మోయడం లాంటిదో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు అర్థమవుతుందని కేటీఆర్ ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాళ్లూ చేతులు కూడదీసుకుని నిలదొక్కుకొని ముందుకు అడుగులు వేయాలి. దానికి విపక్షంలో ఉన్న నాయకులు తమ వంతు సహకారం అందించాలి.

అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే చేసిన వాగ్దానాలను అమలు చేయాలని పట్టుబట్టడం తొమ్మిదిన్నరేళ్ళ కాలంలో మీరు ఏం చేశారన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్న ఆలోచన కూడా ఈ నాయకులకు కరువైందా అన్నట్టు అధికారం కోల్పోయిన పార్టీ వారు ప్రవర్తించడం వింతగా కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో అధికారంలో ఉన్న పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ఇలాంటి డిఫెన్స్ గేమ్ ఆడుతున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా ఉంది. ఈ వాతావరణంలో కాంగ్రెస్ ఎలా తెలివిగా ఆచి తూచి అడుగులు వేస్తుందో చూడాలి.

Also Read:  CM Revanth: స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు: సీఎం రేవంత్‌