Congress New Strategy : కాంగ్రెస్ న‌యా పోక‌డ‌! కోమ‌టిరెడ్డికి పదోన్న‌తి హామీ!

Congress New Strategy : తెలంగాణ కాంగ్రెస్ లోకి ఐక్య‌త మేడిపండు సామెత‌లా ఉంటోంది. ఒక వైపు చేతులు వేసుకుంటూనే క‌డుపులో క‌త్తులు పెట్టుకుంటారు.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 02:28 PM IST

Congress New Strategy : తెలంగాణ కాంగ్రెస్ లోకి ఐక్య‌త మేడిపండు సామెత‌లా ఉంటోంది. ఒక వైపు భుజాల మీద చేతులు వేసుకుంటూనే క‌డుపులో క‌త్తులు పెట్టుకుంటారు. ఇలాంటి ప‌రిస్థితి నుంచి ఆ పార్టీని బ‌యటేసేందుకు ఏఐసీసీ ప్ర‌య‌త్నం చేస్తోంది. నేరుగా రంగంలోకి దిగిన ఢిల్లీ పెద్ద‌లు ఎప్ప‌టికప్పుడు సరిదిద్దుతున్నారు. అయిన‌ప్ప‌టికీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అల‌క‌బూనారు. ఈనెల 17న సీడ‌బ్ల్యూసీ స‌మావేశంకు ఏర్పాట్లు జ‌రుగుతోన్న వేళ కోమ‌టిరెడ్డి ఎపిసోడ్ మ‌రోలా ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ హైద‌రాబాద్ వ‌చ్చే రోజే ఆయ‌న అల‌క‌పాన్పు ఎక్కారు.

ఏఐసీసీ మాత్రం చాలా వ్యూహాత్మ‌కంగా ..(Congress New Strategy)

అప్ర‌మ‌త్త‌మైన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే నేరుగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయ‌న్ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు. ఫోన్లో కేసీ వేణుగోపాల్ నుంచి ఏదో హామీ వ‌చ్చిన త‌రువాత తాత్కాలికంగా అల‌క‌వీడార‌ని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. అయితే, ఏఐసీసీ మాత్రం చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎవ‌రికి ఏ ప‌దవి ఇవ్వాలి? ఎవ‌ర్ని కోర‌ల‌ను తీయాలి? ఎవ‌రి తోక‌లు క‌ట్ చేయాలి? అనే అంశాల‌పై క్లారిటీ ఉంది. గ‌త రెండేళ్లుగా జ‌రిగిన ప‌రిణామాల‌న్నింటినీ అవ‌లోక‌నం చేసుకుంటూ స‌ర్వేల‌ను, క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుంటూ (Congress New Strategy)నిర్ణ‌యాల‌ను తీసుకుంటోంది.

డ‌బుల్ ప్ర‌మోష‌న్ ఇస్తూ ఉత్త‌మ్ ను

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా దెబ్బ‌తిన్న‌దో, అంద‌రికీ తెలిసిందే. మ‌రోసారి అలాంటి పొర‌బాటు జ‌ర‌గ‌కుండా కాంగ్రెస్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. అందుకే, కాంగ్రెస్ పార్టీకి సొంత మనిషిలా ఉండే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పెద్ద పీఠ వేసింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా జాతీయ ఎన్నిక‌ల క‌మిటీలోకి ఆయ‌న్ను తీసుకుంది. అంతేకాదు, ప్ర‌దేశ్ కాంగ్రెస్ స్క్రీన్ క‌మిటీలోనూ స్థానం క‌ల్పించింది. డ‌బుల్ ప్ర‌మోష‌న్ ఇస్తూ ఉత్త‌మ్ ను ఆకాశానికి తీసుకెళ్లింది. అదే సంద‌ర్భంలో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కోంటున్న రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయ‌డానికి పీసీసీకి  (Congress New Strategy)  స‌మాంత‌రంగా ప‌లు క‌మిటీల‌ను వేసింది.

అధిష్టానం వ‌ద్ద  వెంక‌ట‌రెడ్డి మైన‌స్

ఇక కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విష‌యంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆయ‌న త‌మ్ముడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని వెంక‌ట‌రెడ్డి పూడ్చుకోలేక‌పోతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల సందర్భంగా రాజ‌గోపాల్ రెడ్డితో పాటు వెంక‌ట‌రెడ్డి కూడా బీజేపీలోకి వెళ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ త‌మ్ముడు గెలుపు కోసం వెంక‌ట‌రెడ్డి ప్ర‌య‌త్నం చేశారు. ఆ విష‌యాన్ని రేవంత్ రెడ్డి వ‌ర్గం అధిష్టానం వ‌ద్ద బాగా హైలెట్ చేసింది. ఫ‌లితంగా అధిష్టానం వ‌ద్ద మైన‌స్ అయ్యారు. అయిన‌ప్ప‌టికీ ప‌దోన్న‌తిని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆశించారు. కానీ, ప్ర‌స్తుతం మారిన కాంగ్ర్రెస్ వ్యూహాల్లో(Congress New Strategy) భాగంగా ఆయ‌న‌కు ప్రాధాన్యం ల‌భించ‌డంలేదు.

Also Read : Congress : ఎన్నికల కమిటీని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. 16 మందితో నేషనల్ కమిటీ..

మునుగోడు ఉప ఎన్నిక‌ల త‌రువాత కొంత కాలానికి రాజ‌గోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీకి వ‌స్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, రేవంత్ రెడ్డి బ‌హిరంగ సారీ చెప్పాల‌ని కండీష‌న్ పెట్టారు. ఆ లోపు బీజేపీ అధిష్టానం ఆయ‌న‌కు కేంద్ర క‌మిటీలో స్థానం క‌ల్పించింది. ప‌దోన్న‌తిని ఇవ్వ‌డంతో కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చే ఆలోచ‌న తాత్కాలికంగా వెన‌క్కు వెళ్లింది. ఆ క్ర‌మంలో కాంగ్రెస్ అధిష్టానంతో వెంక‌ట‌రెడ్డి చేసిన లైజ‌నింగ్ ప‌నిచేయ‌లేదు. దీంతో మ‌రోసారి అధిష్టానం వ‌ద్ద ఆయ‌నకు మ‌రింత మైన‌స్ అయింది. పైగా ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌తో రేవంత్ రెడ్డి వ‌ర్గం ఆయ‌న మీద సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్య‌తిరేక ప్ర‌చారం చేయించింది. ఫ‌లితంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప‌దోన్న‌తిని పొంద‌డంలో వెనుక‌బ‌డిపోయారు. అదే జిల్లాకు చెందిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వెంట‌వెంట‌నే రెండు ప‌దోన్న‌తుల‌ను పొందారు. దీంతో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అల‌క‌బూనారు.

Also Read : Congress plus Left : కామ్రేడ్ల‌కు మిర్యాల‌గూడ‌, హుస్నాబాద్, మునుగోడు?

త్వ‌ర‌లో ష‌ర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశం ఉంది. ఆ ప్ర‌యత్నం బ‌లంగా చేసిన వాళ్ల‌లో వెంక‌ట‌రెడ్డి ఉన్నారు. ఆమెను తెలంగాణ‌కు రావాల‌ని ఆహ్వానించిన లీడ‌ర్ల‌లో ఆయ‌న ప్ర‌ధ‌ములు. అంటే, రేవంత్ రెడ్డి కి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన పావులు క‌దుపుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వెంక‌ట‌రెడ్డికి ప‌దోన్న‌తి క‌ల్పిస్తే రేవంత్ రెడ్డి నొచ్చుకుంటార‌ని అధిష్టానం వ్యూహాత్మ‌కంగా గేమాడింది. ఒక వైపు ఉత్త‌మ్ కు ప‌దోన్న‌తి క‌ల్పిస్తూనే ష‌ర్మిల‌ను తెలంగాణ‌కు తీసుకొస్తోంది. ఇప్ప‌టికే ఆమెకు స‌న్నిహితులుగా ఉండే పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చ‌క్రం తిప్పుతున్నారు. ఆమెను తెలంగాణ‌కు ఆహ్వానిస్తున్నారు. అంటే, రేవంత్ రెడ్డి వ్య‌తిరేక వ‌ర్గం బ‌ల‌ప‌డేలా కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఆ క్ర‌మంలో తాత్కాలికంగా వెంక‌ట‌రెడ్డిని ప‌క్క‌న పెట్టేసింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కేసీ వేణుగోపాల్ నుంచి ఏదో హామీని వెంక‌ట‌రెడ్డి పొందారు. దీంతో తాత్కాలికంగా అల‌క‌పాన్పు వీడారు. కాంగ్రెస్ మాత్ర‌మే బ‌ల‌ప‌డాల‌ని అధిష్టానం చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. దానిలో భాగంగా లీడ‌ర్ల‌కు ప‌రస్ప‌రం చెక్ పెడుతూ పావులు క‌దుపుతోంది. ఇలాంటి వ్యూహాల‌ను క‌ర్ణాట‌క‌లోనూ ప్ర‌యోగించ‌డం ద్వారా విజ‌యం సాధించిన‌ట్టు చెబుతున్నారు.