Site icon HashtagU Telugu

Kadiyam Kavya : ఎంపీ అభ్యర్థికి సైబర్ కేటుగాళ్ల ఫోన్ కాల్.. ఏం చెప్పారో తెలుసా ?

Warangal MP Kadiyam Kavya

Warangal MP Kadiyam Kavya

Kadiyam Kavya : సైబర్ నేరగాళ్లు బరి తెగిస్తున్నారు.  చివరకు రాజకీయ పార్టీల నాయకులను, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా వారు వదలడం లేదు. తాజాగా.. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు(Kadiyam Kavya) కూడా సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పంపుతాం..  మాకు రూ. 76 వేలు పే చేయండి’’ అని నమ్మబలికారు. వాళ్ల మాటలు విన్న కావ్య షాక్‌కు గురయ్యారు. అభ్యర్థుల ప్రకటనకు ముందు ఆశావాహుల నుంచి కాంగ్రెస్ పార్టీ రూ. 50 వేలు చొప్పున డిపాజిట్ రుసుమును వసూలు చేసింది. అదేవిధంగా ఇప్పుడు బీఫామ్‌లకు కూడా డబ్బులు తీసుకుంటున్నారేమో అని కావ్య భావించారు. దీనిపై తనకు వచ్చిన సందేహాన్ని తన తండ్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కావ్య వివరించారు. దీంతో  శ్రీహరి వెంటనే గాంధీ భవన్‌కు కాల్ చేశారు. బీ ఫామ్‌కు ఏమైనా డబ్బులు కట్టాలా ? అని అడిగారు. అలాంటిదేం లేదు.. డబ్బులు కట్టాల్సిన పనిలేదని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.  దీంతో అది సైబర్ కేటుగాళ్ల  కాల్ అయి ఉండొచ్చనే నిర్ధారణకు కడియం కావ్య వచ్చారు. వెంటనే దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join

సైబర్‌ నేరాలు.. టోల్‌ఫ్రీ నంబరు 1930

ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు ఎక్కువవుతున్నాయి. వివిధ రకాల ఆఫర్లు, ప్రలోభాల పేరిట అమాయక ప్రజలను కేటుగాళ్లు మోసగిస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు పోలీసుశాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. బాధితులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ‘సైబర్‌ వారియర్స్‌’ పేరిట సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సైబర్‌ నేరాలకు గురైన బాధితులు టోల్‌ఫ్రీ నంబరు 1930లో ఫిర్యాదు చేస్తున్నారు. ఘటన చోటుచేసుకున్న తర్వాత ఎంత త్వరగా సమాచారం ఇవ్వగలిగితే అంత త్వరగా నేరాన్ని నియంత్రించేందుకు వీలవుతుంది. ఆలస్యమైతే పరిస్థితి జఠిలంగా మారుతుంది. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిత్యం చాలామంది బాధితులు టోల్‌ఫ్రీ నంబరు 1930ని ఆశ్రయిస్తున్నారు. రద్దీ ఎక్కువ కావడంతో అక్కడ సహాయ కేంద్రాల సంఖ్యను పెంచారు. అయినా విపరీతమైన ఫోన్‌కాల్స్‌ వస్తుండటంతో దాన్ని నియంత్రించేందుకు, బాధితులకు సత్వరం, మేలైన సేవలు అందించేందుకు ఎంపిక చేసిన పోలీసు సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ వారియర్స్‌ను సిద్ధంచేశారు.

Also Read : Longest Mustache : 24 అంగుళాల మీసాల వెనుక.. ఇంట్రెస్టింగ్ స్టోరీ!