తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నేటికీ ఏడాది పూర్తి అవుతున్న సందర్బంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , పలువురు మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఇలా అందరు పాల్గొన్నారు. అయితే పక్కనున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhava Reddy) హాజరుకాకపోవడం తో కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సభ జరుగుతున్న పక్కనే మాధవ రెడ్డి ఇల్లు ఉన్నప్పటికీ..సభకు ఆయన పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది.
ఇది మొదటిసారి కాదు..గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్(Warangal) పర్యటనలకు దూరంగా ఉన్నారు. మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) జిల్లాకు వచ్చినప్పటికీ మాధవరెడ్డి కలవలేదు. ఇలా అగ్ర నేతలు వచ్చినప్పటికీ కలవకుండా ఉండడం పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాధవ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా పార్టీ మారతారనే చర్చ జోరుగా కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే సీనియర్ నాయకుడు అయినా దొంతి దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది.
మొదటి నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అతడి వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి మూడుసార్లు వరంగల్ జిల్లాలో పర్యటించినా దొంతి మాధవ రెడ్డి మాత్రం ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి పదవికి కూడా మాధవరెడ్డి గౌరవం ఇవ్వలేదు. కాగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటనలో మాత్రం మాధవరెడ్డి పాల్గొనడం విశేషం. సీతక్క, కొండా సురేఖ, కడియం కావ్య వంటి వారిపై కూడా ఆయన కోపంతో ఉన్నారని చర్చ జరుగుతోంది. ఇలా కోపంతోనే ఆయన సభకు దూరంగా ఉన్నారు కావొచ్చని ఆయన వర్గీయులు అంటున్నారు.
Read Also : Winter Tips : చలికాలంలో గీజర్‌ని వాడుతున్నప్పుడు వీటి గురించి తెలుసుకోండి..!