Telangana: తెలంగాణలో ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయ పార్టీల తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేస్తున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడం సంచలనంగా మారింది. ఆ తర్వాత కవర్ చేసుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
నిజానికి పాలకుర్తి నుంచి హనుమానండ్ల ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే ఆమెకు భారత పౌరసత్వం లేకపోవడంతో ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ కేటాయించారు. విశేషం ఏంటంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయన మరోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎర్రబెల్లితో పోటీ అంత ఈజీ కాదని తెలిసినా.. యశస్విని ప్రచారంతో హడావుడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రచారంలో జై కేసీఆర్ అనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే యశస్విని రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పాలకుర్తిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో సినిమా డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు తన మనసులో మాట చెప్పిందని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి జై కేసీఆర్ అనడంతో ఆ పార్టీ నేతలు కూడా ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. పోనీ అలవాటులో పొరపాటు ఏంటంటే.. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన నాయకురాలు కూడా కాదు. అయితే కేసీఆర్ పై అభిమానంతో ఆమె అలా మాట్లాడిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
Also Read: Reliance Industries: పశ్చిమ బెంగాల్‌లో 20 వేల కోట్ల పెట్టుబడులు