‘Mission Medigadda’ : బ్యారేజీ కథ ఏంటో చూసేందుకు బయలుదేరిన నేతలు

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 11:27 AM IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. కుంగిన మేడిగడ్డ (Medigadda) బ్యారేజీని సందర్శించేందుకు సీఎం రేవంత్ సహా అధికార పక్ష ఎమ్మెల్యేలంతా బయలుదేరగా.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తుందంటూ నిరసిస్తూ BRS నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో పరస్పర విమర్శలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గంలో బయల్దేరారు. ఎంఐఎం సభ్యులు వీరి వెంట ఉన్నారు. కాగా ఈ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డకు చేరుకునే అవకాశం ఉంది. ఈ పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు సమీపంలో పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకు ముందుకు ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలుకాగా..మేడిగడ్డ సందర్శనకు శాసన సభ్యులందరూ రావాలని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో కోరారు. మేడిగడ్డలో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. అన్ని పార్టీల సభ్యులకు ప్రాజెక్టును చూపించాలని నిర్ణయించామన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇలాంటి పరిస్థితి రాలేదని గుర్తు చేశారు.

అలాగే సీఎం రేవంత్ మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ రావాలని అసెంబ్లీలో మరోసారి కోరారు. ‘అందరం కలిసి వెళదామని బస్సులను సిద్ధం చేశాం. కేసీఆర్ గారికి బస్సులో అంతదూరం ప్రయాణించడం ఇబ్బందిగా ఉంటే ఆయన కోసం బేగంపేట ఎయిర్పోర్టులో ప్రభుత్వ హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. కేసీఆర్ కాళేశ్వరం వచ్చి ఆ అద్భుతాన్ని చూడాలని కోరుతున్నాం’ అని అన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి అంచనాలు పెంచారని BRS నేతలను సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. రూ. వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కడితే కుంగిపోయిందని అన్నారు. ఇసుకలో పేకమేడలు కట్టారా అని ప్రశ్నించారు. మేడిగడ్డ వెళ్లాక విజిలెన్స్ నివేదికను సభ్యులకు అందజేసి.. సభలో త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గాన నేతలంతా మేడిగడ్డ కు బయలుదేరారు.

ఇదిలా ఉంటె సభలో ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా వ్యవహరించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదని.. మిగతా బ్యారేజీలనూ చూడాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ చూస్తోందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం మీద బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తుందని , ఒక బ్యారేజీ పిల్లర్లు కుంగితే ఇష్యూ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : RS Praveen Kumar : గురుకులాల్లో ముందు ఆ పోస్టులను భర్తీ చేయాలి