Site icon HashtagU Telugu

V. Hanumantha Rao : సొంత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన వీ హనుమంతరావు

Vh Ipl

Vh Ipl

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి సొంత ప్రభుత్వం ఫై ఘాటైన విమర్శలు చేసారు. గతంలో సీఎం రేవంత్ ను కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ మీడియా ముందు వాపోయిన వీఎచ్..తాజాగా మాదిగల భూమిని కబ్జా చేస్తే అడ్డుకోనే వారే లేరని..అసలు పట్టించుకునే అధికారులే లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే కీసరలో భూ కబ్జాపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తానే స్వయంగా ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ ఒక్కరూపట్టించుకోలేదని మండిపడ్డారు. ఎవరి భూమి వారిదే అని పాదయాత్రలో చెప్పిన గొప్పలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

1981లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కీసరలో పది మంది పేద మాదిగలకు 94 ఎకరాల భూమి ఇచ్చిందని .. అక్కడ ఓఆర్‌ఆర్‌ రావటంతో పెద్దల కన్ను ఆ భూమిపై పడిందని వెల్లడించారు. ఇందులో భాగంగానే 2003 వరకు పహానీలో వాళ్ల పేర్లు ఉండగా ఆ తర్వాత రాగి కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ భూములను ఫోర్జరీ సంతకాలు చేయించి వారి కుటుంబసభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించినట్టు ఆరోపించారు. దీంతో అసలు భూ యజమానుల వారసులు 120 మంది రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జా స్థలంలో విల్లాలు నిర్మిస్తున్నారని, ఒక్కో విల్లా రూ.3 కోట్లకు విక్రయిస్తున్నారని వివరించారు. ఈ భూమిపై రూ.500 కోట్ల భారీ స్కాం జరుగుతున్నదని ఆరోపించారు. హైకోర్టులో కేసు ఉండగా ఈ స్థలంలో విల్లాల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు.

ఇప్పుడు 30 ఎకరాలకు అనుమతి ఇచ్చారని, విల్లా నిర్మాణం కొనసాగుతున్నదని తెలిపారు. వెంటనే ఈ పనులను ఆపేయించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై రెవెన్యూ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని, దానకిశోర్‌ను అడిగితే చూస్తున్నాం సర్‌ అని అంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు.

Read Also  : Caller ID Display: తెలియని నంబర్‌ నుంచి కాల్స్‌ వస్తున్నాయా..? ఆ నెంబర్ ఎవరిదో ఇక పేరు కనిపిస్తుంది..!