Dasoju Sravan : బీజేపీలో చేరిన తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్‌

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత దాసోజు శ్రవణ్ ఆదివారం బీజేపీలో చేరారు

  • Written By:
  • Updated On - August 7, 2022 / 03:54 PM IST

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత దాసోజు శ్రవణ్ ఆదివారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్‌ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వివేక్‌ వెంకస్వామి, సీనియర్‌ నేత మురళీధర్‌రావు, ఇతర నేతలు పాల్గొన్నారు. తరుణ్ చుగ్ శ్రవణ్‌కు పార్టీ సభ్యత్వ కార్డును అందించి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రవణ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రాజకీయ మార్పు రావాలన్నారు. ఫెమా ఉల్లంఘనలపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వెనుక టీఆర్‌ఎస్‌కి చెందిన పలువురు నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని లూటీ చేయడంలో బిజీగా ఉన్నారని శ్రవణ్ అన్నారు. రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు.

కేసీఆర్‌ను అధికారం నుంచి దించాల్సిన సమయం ఆసన్నమైందని తరుణ్ చుగ్ అన్నారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితుడై శ్రవణ్ బీజేపీలో చేరినట్లు తరుణ్ చుగ్ తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని అన్నారు.
టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో మొత్తం గందరగోళం ఉందని శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో బానిసలా జీవించడానికి సిద్ధంగా లేన‌ని.. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత కులం, ధనబలం ప్రాతిపదికన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సిద్ధాంతాలన్నింటినీ రేవంత్ రెడ్డి తెలంగాణలో గాలికొదిలేశారని అన్నారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్, వ్యూహకర్త సునీల్ కారణమని ఆయన ఆరోపించారు.