Bakka Judson : ఢిల్లీకి చేరిన కేసీఆర్ విమానం కొను`గోల్`మాల్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త విమానం కొనుగోలు వ్య‌వ‌హారం ఢిల్లీలోని ఈడీకి చేరింది. తెలంగాణ పీసీసీ ప్రధాన కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ కొన్ని ఆధారాల‌ను చూపుతూ ఈడీకి ఫిర్యాదు చేశారు.

  • Written By:
  • Updated On - October 11, 2022 / 04:50 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త విమానం కొనుగోలు వ్య‌వ‌హారం ఢిల్లీలోని ఈడీకి చేరింది. తెలంగాణ పీసీసీ ప్రధాన కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ కొన్ని ఆధారాల‌ను చూపుతూ ఈడీకి ఫిర్యాదు చేశారు. ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ, సీఎం కేసీఆర్ మ‌ధ్య `క్విడ్ ప్రో కో` న‌డిచింద‌ని ఆధారాల‌ను జ‌త చేస్తూ ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

ప్రముఖ ఫార్మా కంపెనీకి సంబంధించిన నిధుల మూలాన్ని ఈడీ ఫిర్యాదులో జ‌డ్స‌న్ పొందుప‌రిచారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఈడీని క‌లిసి పూర్తి వివ‌రాల‌ను అంద‌చేస్తూ విచార‌ణ చేయాల‌ని కోరారు. ఒక అల్ట్రా-మోడరన్ 12 సీట్ల విమానం కొనుగోలు చేశార‌ని, అందుకు విరాళాలు వ‌చ్చాయ‌ని చెప్ప‌డం అబ‌ద్ధ‌మ‌ని పొందుప‌రిచారు. ఒక ఫార్మా కంపెనీ ఆ విమానాన్ని కొనుగోలుకు నిధుల‌ను స‌మ‌కూర్చింద‌ని ఆరోపించారు. క‌ల్వ‌కుంట్ల కేసీఆర్ కుటుంబానికి , ఫార్మా కంపెనీకి మ‌ధ్య ఉన్న అపవిత్ర సంబంధాన్ని పరిశోధించాల‌ని అభ్య‌ర్థించారు.

కొన్నేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుంటుంబానికి సంబంధించిన అంశాల‌పై జ‌డ్స‌న్ పోరాడుతున్నారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు సీబీఐ, ఈడీ, విజిలెన్స్, ఐటీ త‌దిత‌ర శాఖ‌ల‌కు ఆధారాల‌ను ఇచ్చారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద సేక‌రించిన వివ‌రాల‌ను జ‌త చేస్తూ కాళేశ్వ‌రం, మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ త‌దిత‌రాల్లో జ‌రిగిన అక్ర‌మాల‌కు సంబంధించిన ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మించిన మేఘా సంస్థ సుమారు రూ. 12వేల కోట్ల జీఎస్టీ ఎగ‌వేసిన అంశాన్ని ఇటీవల ఈడీ దృష్టికి తీసుకెళ్లారు.

తాజాగా ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఉన్న క‌విత వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్టారు. అంతేకాదు, ఆమె ఆస్తుల మీద ఫిర్యాదు చేశారు. అక్ర‌మ ఆస్తుల వివ‌రాల‌ను ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అందించారు. ఇటీవ‌ల విడుద‌లైన లైగ‌ర్ సినిమాకు నిధుల‌ను అక్ర‌మంగా ఇవ్వ‌డం ద్వారా న‌ల్ల‌ధ‌నాన్ని ఏ విధంగా వైట్ గా మార్చుకున్నార‌నే విష‌యాన్ని ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఆయ‌న కుటుంబంలోని వాళ్ల ఆస్తుల వివ‌రాల‌ను జ‌డ్స‌న్ సేక‌రించారు. వాటిని దర్యాప్తు సంస్థ‌ల‌కు అప్ప‌గించ‌డం ద్వారా విచార‌ణ చేప‌ట్టాల‌ని ప‌లుమార్లు కోరారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ర్యాప్తు సంస్థ ఏదీ ప్రాథ‌మిక విచార‌ణ కూడా ఆయ‌నిచ్చిన ఫిర్యాదు మీద జ‌ర‌ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.