Jagga Reddy : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమాత్రం నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న తూటా ప్రేమను ప్రజలు గుర్తించాలని అన్నారు. తెలంగాణ బీజేపీ (Telangana BJP) ఎంపీలపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి, ‘‘రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా, వారు ఏం సాధించారు?’’ అంటూ నిలదీశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాడటంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి కృషి చేయకుండా, మౌనంగా ఉండడమే బీజేపీ ఎంపీల కర్తవ్యంగా మారిందన్నారు.
ఈసారి కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించిందని, ఇది దేశ బడ్జెట్ కాదని, బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్టితో రూపొందించిన బడ్జెట్‌గా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి , బండి సంజయ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు ఏటా రూ.లక్ష కోట్లకు పైగా చెల్లిస్తున్నా, తిరిగి రాష్ట్రానికి కేంద్రం గోరంత కూడా కేటాయించలేదని మండిపడ్డారు.
తెలంగాణ బీజేపీ నేతలు అవసరంలేని వాగ్వాదాలకు మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేసిన జగ్గారెడ్డి, కేంద్రం చేస్తున్న అన్యాయంపై కాంగ్రెస్ తరపున తీవ్ర పోరాటం చేపడతామని ప్రకటించారు. యూపీఏ హయాంలో హైదరాబాద్‌లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వల్లే రాష్ట్ర బడ్జెట్ రూ. మూడు లక్షల కోట్లకు చేరిందని, అది యూపీఏ పాలన విజయమని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో తెలంగాణకు అభివృద్ధి ఏమాత్రం జరగలేదని స్పష్టం చేశారు.
తెలంగాణకు జరిగిన అన్యాయంపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ భవిష్యత్తులో మరింత తీవ్రంగా పోరాటం చేపడుతుందని స్పష్టం చేశారు.