Revanth Reddy : రేవంత్ కు ఠాగూర్ క్లాస్ ?

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి ఠాగూర్ మొన్న‌టి వ‌ర‌కు రేవంత్ రెడ్డికి అండ‌గా ఉన్నాడు. ఆయ‌నే పీసీసీగా రేవంత్ ను ప్ర‌మోట్ చేశాడ‌ని కాంగ్రెస్ లోని ఒక వ‌ర్గం ప్ర‌చారం చేసింది.

  • Written By:
  • Publish Date - January 6, 2022 / 01:11 PM IST

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి ఠాగూర్ మొన్న‌టి వ‌ర‌కు రేవంత్ రెడ్డికి అండ‌గా ఉన్నాడు. ఆయ‌నే పీసీసీగా రేవంత్ ను ప్ర‌మోట్ చేశాడ‌ని కాంగ్రెస్ లోని ఒక వ‌ర్గం ప్ర‌చారం చేసింది. దాదాపు రూ. 25కోట్లకు పీసీసీ ప‌ద‌విని అమ్ముకున్నాడ‌ని కాంగ్రెస్ లోని సీనియ‌ర్లు కొంద‌రు బాహాటంగా మీడియాకు ఎక్కిన విష‌యం తెలిసిందే. తాజాగా ఠాగూర్ కూడా యూట‌ర్న్ తీసుకున్నాడ‌ని అనిపిస్తోంది. గాంధీభ‌వ‌న్లో బుధ‌వారం జ‌రిగిన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌మావేశం సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అందుకు బ‌లం చేకూరేలా ఉన్నాయి. స‌మావేశం సంద‌ర్భంగా సీనియ‌ర్లు రేవంత్ రెడ్డి వాల‌కంపై మండిప‌డ్డార‌ని తెలుస్తోంది. వ్య‌క్తిగ‌త ఫోక‌స్ కోసం పార్టీని వాడుకుంటున్నాడ‌ని ఠాగూర్ ఎదుటే సీనియ‌ర్లు మొర‌పెట్టుకున్నార‌ట‌.సీనియ‌ర్ల మాట‌ల‌ను ఆల‌కించిన ఠాగూర్ ఇక నుంచి ప‌ద్దతి మార్చుకోవాల‌ని రేవంత్ కు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, సీనియ‌ర్లు త‌ర‌చూ మీడియాకు ఎక్క‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టార‌ని వినికిడి. కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఇటీవ‌ల రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యాడు. పీసీసీ అధ్యక్షుడిగా ఆయ‌న ప‌నికిరాడ‌ని మీడియా ముఖంగా వెల్ల‌డించాడు. హుజురాబాద్ ఫ‌లితాలతో పాటు మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను కూడా ప్ర‌స్తావించాడు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ ప‌రిధిలోని ఫ‌లితాల‌ను గుర్తు చేశాడు. ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా సంగారెడ్డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మాల‌ను రేవంత్ రెడ్డి ఎలా నిర్వ‌హిస్తాడ‌ని ప్ర‌శ్నించాడు. ఇలా..ప్ర‌శ్నించే వాళ్ల‌ను కోవ‌ర్ట్ లుగా సొంత సోష‌ల్ మీడియా ద్వారా టార్గెట్ చేయ‌డాన్ని దుయ్య‌బ‌ట్టాడు. ఈ అంశాల‌పై రేవంత్, జ‌గ్గారెడ్డి మ‌ధ్య వారం పాటు వార్ జ‌రిగింది.

వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ చిన్నారెడ్డి జోక్యం చేసుకున్నాడు. ఆ విష‌యం కూడా బుధ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇంకోవైపు అంజ‌న్ కుమార్ యాద‌వ్ ఆ స‌మావేశంలో స్పందించాడ‌ని తెలిసింది. త‌న ప‌రిధిలోని హైద‌రాబాద్ కు చాలా మంది వ‌చ్చి వెళుతుంటార‌ని స‌ర్థిచెప్పే ప్ర‌య‌త్నం చేస్తూ ప‌రోక్షంగా రేవంత్ కు మ‌ద్ధ‌తు ప‌లికేలా మాట్లాడ‌డాన్ని జ‌గ్గారెడ్డి సీరియస్ గా తీసుకున్నాడ‌ట‌. ఇక జానారెడ్డి కూడా ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న అంత‌ర్గ‌త ప‌రిణామాల‌పై అసంతృప్తిని వ్య‌క్త‌ప‌రిచ‌న‌ట్టు తెలుస్తోంది. ఎప్ప‌టి మాదిరిగానే వీహెచ్‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్పందించ‌డంతో ఠాగూర్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని స‌మాచారం.ప్ర‌స్తుతం డిజిట‌ల్ ప‌ద్ధ‌తిన స‌భ్య‌త్వ న‌మోదు జరుగుతోంది. ల‌క్ష్యానికి చాలా దూరంగా ఆ కార్య‌క్ర‌మం ఉంది. డిసెంబ‌ర్ 20న స‌భ్య‌త్వ న‌మోదును ప్రారంభించిన‌ప్ప‌టికీ 3ల‌క్ష‌ల‌కు మించ‌లేదు ఆ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకోవాల‌ని ఠాగూర్ సీనియ‌ర్ల‌కు దిశానిర్దేశం చేశాడ‌ని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ సీనియ‌ర్ల మ‌ధ్య న‌డుస్తోన్న అంత‌ర్గ‌త యుద్ధం కార‌ణంగా స‌భ్య‌త్వం జ‌ర‌గ‌డంలేద‌ని ఠాగూర్ గ్ర‌హించార‌ట‌. అందుకే, రేవంత్ రెడ్డికి చుర‌క‌లు వేశాడ‌ని తెలుస్తోంది. అంత‌ర్గ‌త విభేదాల‌ను మీడియా ఎదుట ప్ర‌స్తావించ‌డానికి లేద‌ని సీనియ‌ర్ల‌కు ఠాగూర్ క్లియ‌ర్ గా చెప్పాడ‌ట‌. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే, నేరుగా ఏఐసీపీ కార్య‌ద‌ర్శి, సోనియా, రాహుల్ కు తెలియండ‌ని సూచించాడు. సో..ఇక నేరుగా ఢిల్లీకి ఫిర్యాదుల వెల్లువ ఉండ‌బోతుంద‌న్న‌మాట‌.