Cabinet Expansion: ఎట్టకేలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) రాష్ట్ర కార్యవర్గానికి తుదిరూపు ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవుల కేటాయింపుపైనా కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ అంశాలపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం రాత్రి చర్చించారు. ఈరోజు (సోమవారం) మరోసారి వేణుగోపాల్‌తో రేవంత్, మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏయే సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే దానిపై వేణుగోపాల్ నుంచి స్పష్టతను కోరే అవకాశం ఉంది. తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఆ వర్గానికి మంత్రి పదవులు తక్కువగా వచ్చిన విషయాన్ని వేణుగోపాల్‌కు ఈరోజు తెలియజేసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణను దేశంలోనే తొలిసారిగా తెలంగాణ(Cabinet Expansion)లో అమలు చేస్తున్నందున, మాదిగలకు మంత్రి పదవులు దక్కాలని కోరనున్నట్లు సమాచారం. బీసీ, ఎస్సీ, ఓసీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కో నేతకు మంత్రి పదవిని ఇవ్వొచ్చని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెబుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులకు పోటీ ఎక్కువగా ఉన్నందున, వాటి కోసం సరైన నేతను ఎంపిక చేసే బాధ్యతను పార్టీ హైకమాండే తీసుకోవాలని రేవంత్ ఇప్పటికే కోరినట్లు తెలిసింది.
Also Read :Heinrich Klaasen: చరిత్ర సృష్టించిన క్లాసెన్.. 37 బంతుల్లోనే సెంచరీ!
టీపీసీసీ కార్యవర్గం ఎంపికకు కసరత్తు
- టీపీసీసీ కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. అందుకే ఈ పదవులకు ఎంపికైన నేతల జాబితాను తొలుత ప్రకటించనున్నట్లు సమాచారం.
- వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా నలుగురు నేతలకు ఛాన్స్ ఇస్తారని తెలిసింది. వీరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉంటారని అంటున్నారు.
- ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చే ఛాన్స్ ఉంది.
- వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్న వారిలో ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ముందంజలో ఉన్నారు.
- టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల విషయానికొస్తే.. జిల్లాలవారీగా 2017 నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటున్న ముఖ్యనేతల పేర్లు, వివరాలను పరిశీలిస్తున్నారు. ఆయా నేతల గురించి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
- ఏ ఒక్క సామాజికవర్గానికి రెండు పదవులు ఇవ్వకూడదనే విధానం అనుసరించనున్నారు. ఉదాహరణకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి ఇవ్వరు.
నేడు సామాజిక న్యాయసదస్సుకు రేవంత్
బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సామాజిక న్యాయసదస్సును నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొననున్నారు.