KCR Mark : కేసీఆర్ మార్క్‌ను చెరిపివేసే దిశగా కసరత్తు.. ఆ మార్పులే సంకేతం

తెలంగాణలో వేగంగా చాలా మార్పులు జరుగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - May 30, 2024 / 08:27 AM IST

KCR Mark :  తెలంగాణలో వేగంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ సర్కారు తనదైన మార్క్ వేసే దిశగా అడుగులు వేస్తోంది. పదేళ్ల కేసీఆర్ మార్క్‌ను చెరిపివేసి.. ప్రజలకు చేరువయ్యేందుకు రేవంత్ సర్కారు ముమ్మర కసరత్తు  చేస్తోంది.  అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించ బోతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి స్వరకల్పనలో సిద్ధం చేస్తున్న ఈ గీతాన్ని జూన్ 2న ఆవిష్కరించబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

  • తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదని కేసీఆర్ కుమార్తె కవితలా ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతమున్న తెలంగాణ తల్లి విగ్రహం తలపై కిరీటంతో రాచరికానికి చిహ్నంగా కనిపిస్తోందని కాంగ్రెస్ సర్కారు పెద్దలు చెబుతున్నారు. అందుకే తెలంగాణ అస్తిత్వం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేస్తామని అంటున్నారు. ఈ విగ్రహాన్ని కూడా జూన్  2న ఆవిష్కరించనున్నారు.
  • తెలంగాణ అధికారిక చిహ్నం మారిపోనుంది. కాకతీయ తోరణం, చార్మినార్ వంటి రాచరిక ఆనవాళ్లు లేకుండా  తెలంగాణ యోధుల త్యాగాలు, పోరాటాలను అద్దంపట్టేలా తెలంగాణ అధికారిక చిహ్నాన్ని రెడీ చేస్తున్నారు.  సమ్మక్క-సారక్క, నాగోబా జాతరల స్ఫూర్తి, తెలంగాణ అమరుల వీరత్వంను ప్రతిబింబించేలా సరికొత్త  తెలంగాణ అధికారిక చిహ్నాన్ని రెడీ చేయిస్తున్నారు.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాన్ని టీజీగా పిలుచుకోవాలని, వాహనాలపై టీజీ ఉంటుందని అందరూ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం అనూహ్యంగా టీఎస్‌ను ఖరారు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్‌ను టీజీగా మార్చింది.

Also Read : Votes Counting : జూన్ 4న ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా ?

సాంస్కృతిక వైరుధ్యం ప్రాతిపదికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ గీతం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు గుర్తించింది. అందుకే వాటిపై ఉన్న కేసీఆర్ మార్క్‌ను తొలగించే దిశగా కసరత్తు చేస్తోంది. జూన్ రెండో తేదీన తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవం రోజున వీటిపై అధికారిక ప్రకటనను సీఎం రేవంత్ చేయబోతున్నారు. అయితే ఈ మార్పులపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలు, మేధావుల నుంచి మాత్రం వ్యతిరేకత రావడం లేదు. తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశాల్లో కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ప్రజలు భావించడం వల్లే ఇప్పుడు వ్యతిరేకతను వ్యక్తం చేయడం లేదని పరిశీలకులు అంటున్నారు.

Also Read :PM Modi : నేటి నుండి ధ్యానంలో ప్రధాని మోడీ..