తెలంగాణలో మహిళల కోసం నూతన ఏడాది కానుకగా (New Year Gift) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో సర్కార్ ఉచిత యూనిఫాం చీరలను అందించనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల స్వయం సహాయక మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా చీరలు(Sarees for free) అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ చీరల డిజైన్లు రూపొందించారు. లైట్ బ్లూ కలర్ చీరలకు జాతీయ జెండా మూడు రంగులను అంచుల్లో కలిపి అందంగా డిజైన్ చేశారు. ఈ చీరలను స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆయలకు కూడా అందించనున్నారు. మంత్రి సీతక్క తాజాగా ఈ డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించి ఆయన అనుమతి పొందారు. తెలంగాణ హ్యాండ్‌లూమ్ కోఆపరేటివ్ సొసైటీ (TGSCO) ద్వారా ఈ చీరలను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి సంవత్సరం రెండు చీరలను ఉచితంగా అందజేయాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంపై మంత్రి సీతక్క ట్వీట్ చేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి కొత్తగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత చీరల పంపిణీ ద్వారా వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా హ్యాండ్‌లూమ్ రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
Read Also : Virat Kohli’s Bat: ఫాలోఆన్‌ను తప్పించుకున్న భారత్.. కోహ్లీ సాయం కూడా ఉందండోయ్!