Site icon HashtagU Telugu

Telangana Congress : ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోక‌స్‌.. సీనియ‌ర్ నేత‌కు కీల‌క బాధ్య‌తలు

Congress

Congress

తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. సమర్ధమైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది. అందులో భాగంగా తాజాగా పార్టీ సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు వచ్చారు. కేఎల్ఆర్ తో స‌మావేశమై రంగారెడ్డి జిల్లాలో పార్టీ వ్యవహారాల పైన చర్చించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలను ఆయ‌న‌కు అప్పగించారు. గతంలో మేడ్చల్ ఎమ్మెల్యేగా పని చేసిన కేఎల్ఆర్ కాంగ్రెస్ నాయకత్వానికి విధేయుడిగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో కేఎల్ఆర్ కు ఉన్న పట్టుతో ఎన్నికల వేళ ఆయన సేవలను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త నేతల చేరికలను ప్రోత్సహిస్తూనే.. సమర్ధవంతమైన నేతలకు జిల్లాల బాధ్యతలు కేటాయిస్తోంది. పార్టీ గెలుపు కోసం ప్రజలను ప్రభావితం చేయగలగిని నేతలకు ప్రాధాన్యత ఇస్తుంది. రంగారెడ్డి జిల్లా తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ తొలి నుంచి పార్టీ కోసమే పని చేస్తున్న కేఎల్ఆర్ ను పార్టీ గుర్తించింది. ఆర్థిక, అంగ బలం కలిగిన కేఎల్ఆర్ సేవలను పార్టీకి ఎన్నికల సమయంతో సహకరిస్తారనే అభిప్రాయానికి వచ్చింది. దీంతో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు నేరుగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నివాసానికి వెళ్లారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం పైన కేఎల్ఆర్ కు పట్టు ఉండటంతో ఆయనతో కీలక చర్చలు జరిపారు. ప్రతీ నియోజకవర్గం పైనా ఫోకస్ పెట్టాలని..పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్దులను చేసేలా కార్యాచరణతో రంగంలోకి దిగాలని పార్టీ ముఖ్య నేతలు కేఎల్ఆర్ కు సూచించారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని కోరారు. దీంతో ఇప్పుడు కేఎల్ఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోనూ మంచి పట్టు ఉన్న నేతగా కేఎల్ఆర్ కు గుర్తింపు ఉంది. దీంతో ముందుగా చేవెళ్ల అసెంబ్లీ పరిధిలోని పార్టీ కీలక నేతలతో సమావేశమైన కేఎల్ఆర్ తనకు పార్టీ అప్పగించిన బాధ్యతల అమలుకు రంగంలోకి దిగారు.