Sonia Gandhi : కేసీఆర్ కు ఝలక్ ఇవ్వబోతున్న సోనియా!

బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 03:30 PM IST

బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కాలం కలిసి రావడంలేదో.. అవతలి పార్టీలు ముందుకు రావడం లేదో కాని.. ఆయన చర్యలన్నీ చర్చలకే పరిమితమవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అంతే. దీంతో కేసీఆర్ ను కాదని.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ రంగంలోకి దిగారు.

అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థికోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తోంది. కాంగ్రెస్ ప్రతిపాదించే అభ్యర్థిని మిగిలిన పార్టీలు ఒప్పుకునే ఛాన్సే లేదు. అందుకే విపక్షాలు సూచించే పేరుకే మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శరద్ పవార్ లేదా దేవెగౌడ అయితే అందరూ ఒప్పుకునే ఛాన్స్ ఉందని… వారి అభ్యర్థిత్వంపై చర్చలు జరుపుతోంది. ఒకవేళ దక్షిణాది లెక్కే చూడాలంటే.. వెంకయ్య లేదా తమిళి సై పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అదే ముస్లింలకు ఇవ్వాలనుకుంటే గులాంనబీ అభ్యర్థిత్వంపైనా చర్చ జరుగుతోంది. వీరు కాకుండా ఈసారి గిరిజన మహిళకు ఇవ్వాలనుకుంటే జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ముకు కాని లేదా ఛత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయా యూకీకి కాని ఛాన్స్ దక్కొచ్చు.

శరద్ పవార్, మమతా బెనర్జీ, ఉద్దవ్ థాక్రే తోనూ సోనియా స్వయంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రతినిధిగా మల్లిఖార్జున ఖర్గే కూడా బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తున్నారు. విపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ఏకాభిప్రాయానికి వస్తే.. అప్పుడు ఎవరిని బరిలోకి దింపాలన్నదానిపై క్లారిటీకి వస్తామంటోంది కాంగ్రెస్. ఎన్డీఏ తనకు అవసరమైన మెజారిటీలో కాస్త దూరంలో ఆగిపోయింది. అందుకే ఆ చిన్న అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.