Telangana: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయ పార్టీలలో ఆందోళన మొదలైంది. ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. తాజాగా హైదరాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.
కాంగ్రెస్ అభ్యర్థి మల్లారెడ్డి రంగారెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నామినేషన్ వేసేందుకు ఇబ్రహీంపట్నంలోని నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు ఎదురు పడ్డారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరికి గాయాలయ్యాయి.దీంతో అక్కడ ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేసి అదనపు బలగాలను మోహరించారు. ఘర్షణ వాతావరణం సద్దుమణిగిన తర్వాత నామినేషన్ ప్రక్రియ ముగిసింది.