Target Chinna Jeeyar Swamy : జీయ‌ర్ హ‌ఠావో..తెలంగాణ బ‌చావో..!

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల‌ను టార్గెట్ చేయ‌డానికి త్రిదండి చిన జీయ‌ర్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రం దొరికింది.

  • Written By:
  • Publish Date - March 17, 2022 / 11:26 AM IST

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల‌ను టార్గెట్ చేయ‌డానికి త్రిదండి చిన జీయ‌ర్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రం దొరికింది. తెలంగాణ స‌ర్కార్ కు షాడో మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న జీయ‌ర్‌, ఆయ‌న ఆస్తుల‌పై కాంగ్రెస్ నేత‌లు ఆరా తీస్తున్నారు. వాటిని బ‌య‌ట పెట్ట‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. స‌మ్మ‌క్క‌, సారల‌మ్మ దేవ‌త‌ల‌ను కించిప‌రిచిన జీయ‌ర్ కు టీఆర్ఎస్, బీజేపీ అండ తొలి నుంచి ఉంది. ఇప్పుడు ఆ రెండు పార్టీల‌ను కార్న‌ర్ చేయ‌డం ద్వారా గిరిజన ఓటు బ్యాంకును సొంత చేసుకునే మాస్ట‌ర్ ప్లాన్ కాంగ్రెస్ వేసింది. గిరిజ‌న నేత‌గా పేరున్న ఎమ్మెల్యే సీత‌క్క రంగంలోకి దిగింది. గిరిజ‌నుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా మాట్లాడిన జీయ‌ర్ కు వార్నింగ్ ఇచ్చింది.చినజీయర్ స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ లో ప్ర‌స్తుతం ఫిర్యాదు ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కేసులు న‌మోదు చేయాల‌ని ప‌రిష‌త్ పిలుపు నిచ్చింది. ఫిర్యాదు అనంత‌రం ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు మల్లుదొర జీయ‌ర్ పై ఫ‌ర్ అయ్యాడు. ఆదివాసీ ఆడబిడ్డల చరిత్ర తెలియని చినజీయర్ కు వారి గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డాడు. జనాల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర చినజీయర్ కు ఉంద‌ని ఆరోపించాడు. సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా జీయ‌ర్ పై ఉద్య‌మానికి ప‌రిష‌త్ సిద్ధం అవుతోంది.

Also Read : Exclusive Inside Story : ‘ముచ్చింతల్’ కోట ర‌హ‌స్యం!

హిందూవాదాన్ని బలంగా వినిపించే బీజేపీకి చెందిన చాలా మంది లీడ‌ర్లు జీయ‌ర్ ఆశ్ర‌మానికి వెళుతుంటారు. అంతేకాదు, జీయ‌ర్ కోట‌రీలో క‌మ‌ల‌నాథులు కొంద‌రు కీల‌కంగా ఉన్నారు. త‌ర‌చూ ఆశ్ర‌మానికి వెళుతూ హిందూవాదాన్ని బ‌య‌ట‌కు వినిపిస్తూ వ్యాపార లావాదేవీలు న‌డుపుతున్న లీడ‌ర్లు లేక‌పోలేదు. వాళ్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ సేక‌రిస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు జీయ‌ర్ ను టార్గెట్ చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇదో అందొచ్చిన అవ‌కాశంగా మ‌లుచుకుంటున్నాడని తెలిసింది. హిందూవాదం ముసుగులో జీయ‌ర్ నీడ‌న జ‌రుగుతోన్న బ‌డా వ్యాపారాల‌ను బ‌య‌ట పెట్టాల‌ని యోచిస్తున్నాడ‌ట‌. ఫ‌లితంగా బీజేపీ వినిపిస్తోన్న హిందూవాదాన్ని కూడా ప్ర‌శ్నించ‌డానికి అవ‌కాశం ఉంటుంది.ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ స‌భ‌లు పెట్టిన రేవంత్ వాళ్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇప్పుడు వాళ్ల మ‌నోభావాల కోసం స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేకాదు, బీజేపీని కార్న‌ర్ చేయ‌డానికి మేడారం జాత‌ర‌పై జీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఫోక‌స్ చేయ‌నున్నారు. క‌మ‌ల‌ద‌ళానికి, జీయ‌ర్ కు ఉన్న సంబంధాల‌ను బ‌య‌ట‌పెడుతూనే ఆశ్ర‌మంలో జ‌రుగుతోన్న వ్యాపారాల‌ను బ‌య‌ట పెట్ట‌డానికి కాంగ్రెస్ సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : రాజ‌కీయ ‘జాత‌ర‌’లో జీయ‌ర్

తెలంగాణ సీఎం కేసీఆర్, చిన జియ‌ర్ మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం అందిరికీ తెలిసిందే. ప‌లు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు జీయ‌ర్ పెట్టే ముహూర్తం మేర‌కు కేసీఆర్ ప్రారంభిస్తుంటాడు. ఆశ్ర‌మానికి ప్ర‌భుత్వం భూమిని త‌క్కువ ధ‌ర‌కు కేటాయించాడు. ఆర్టీసీ కార్మికుల నిర‌వ‌ధిక దీక్ష‌లు జ‌రిగిన‌ప్పుడు కేసీఆర్ తో మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించాల‌ని కార్మికులు ఆశ్ర‌మం వ‌ద్ద‌కు వెళ్లారు. అంటే, తెలంగాణ సీఎం కేసీఆర్‌, జీయ‌ర్ మ‌ధ్య ఉన్న బంధం ఎలాంటిదో అర్థం అవుతోంది. ఆ సాన్నిహిత్యాన్ని ఫోక‌స్ చేస్తూ జీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల మీదుగా కేసీఆర్ ను టార్గెట్ చేయాల‌ని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ప్రాంతీయ అంశాన్ని కూడా తెర‌మీద‌కు తీసుకురావాల‌ని స్కెచ్ వేస్తోంది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన జీయ‌ర్ కు తెలంగాణ సీఎం ఇస్తోన్న ప్రాధాన్యత‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల బోతున్నారు. త‌ద్వారా సెంటిమెంట్ తో గెలుస్తూ వ‌స్తోన్న కేసీఆర్ వ్యూహానికి గండికొట్టాల‌ని కాంగ్రెస్ ఎత్తుగ‌డ వేస్తోంది.
ఒక దెబ్బ‌కు రెండు పిట్టల్లా జీయ‌ర్ రూపంలో అందొచ్చిన అస్త్రాన్ని ఒకేసారి బీజేపీ, టీఆర్ఎస్ మీద ప్ర‌యోగించ‌డానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిద్ధం అవుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే ఆశ్ర‌మ వివ‌రాల‌ను సేక‌రించిన రేవంత్ రెడ్డి మేడారం జాత‌ర‌ను కించ‌ప‌రిచిన అంశాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నాడట‌. సో..రాజ‌కీయంగా ఎలాంటి ల‌బ్ది కాంగ్రెస్ కు ల‌భిస్తుందో..ఏమోగానీ జీయ‌ర్, ఆయ‌న ఆశ్ర‌మం కార్యక‌లాపాలు రోడ్డున‌ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు.