తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా స్పష్టంగా కొనసాగింది. తొలి విడత ఎన్నికల్లో మాదిరిగానే, రెండో విడతలోనూ అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఆదివారం (డిసెంబర్ 14న) 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది. అర్ధరాత్రి 12:30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థులు (ఏకగ్రీవాలతో కలిపి) 2,297 స్థానాలలో విజయం సాధించి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇది కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో పట్టును పెంచుకున్నట్లు సూచిస్తోంది.
Leo to Meet PM Modi in Delhi Today : నేడు ప్రధానితో మెస్సీ భేటీ
కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మద్దతుదారులు 1,191 సర్పంచ్ స్థానాల్లో, బీజేపీ మద్దతుదారులు 257 స్థానాల్లో విజయం సాధించారు. ఇతరులు 578 స్థానాల్లో గెలుపొందగా, సీపీఐ, సీపీఎం మద్దతుదారులు కూడా కొన్ని స్థానాలను దక్కించుకున్నారు. ఈ దశలో మొత్తం 3,911 గ్రామ పంచాయతీలకు జరిగిన పోలింగ్‌లో 85.86 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది తొలి విడత (84.28%) కంటే 1.58 శాతం ఎక్కువ. జిల్లా స్థాయిలో చూస్తే, 27 జిల్లాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాలు దక్కించుకున్నారు. మరోవైపు, కుమురంభీం, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో బీఆర్‌ఎస్, నిర్మల్ జిల్లాలో బీజేపీ ఆధిక్యం చూపాయి.
రెండో విడత ఎన్నికల కోసం మొత్తం 4,333 సర్పంచ్ స్ధానాలు మరియు 38,350 వార్డు సభ్యుల పదవులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇందులో 415 సర్పంచ్ పదవులు మరియు 8,307 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్ ప్రక్రియలో 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తిలో 104 ఏళ్ల మాణిక్యమ్మ వీల్ చైర్‌లో వచ్చి ఓటు వేయడం, నిర్మల్‌లో రష్యా నుంచి వచ్చిన యువతి ఓటు వేయడం వంటి విశేషాలు నమోదయ్యాయి. మొత్తంగా, తొలి విడతలో మాదిరిగానే 2,425 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, రెండో విడతలోనూ అత్యధిక స్థానాలు సాధించడంతో గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ పట్టు బలపడినట్లు స్పష్టమవుతోంది.
