BRS Party: తెలంగాణలో ఆ రెండు పార్టీలు ఒక్కటే: మాజీ మంత్రి సింగిరెడ్డి

  • Written By:
  • Updated On - February 18, 2024 / 06:20 PM IST

BRS Party: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ భవన్ లో ఇవాళ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, కేసీఆర్ మీద బురదజల్లిన బీజేపీ కాంగ్రెస్ ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదు అని ఆయన మండిపడ్డారు. ఉచిత బస్సు తప్ప 72 రోజులలో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంకోసం  కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్ లో సరిపడా కేటాయింపులు లేవు అని ఆయన విరుచకుపడ్డారు.

‘‘మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతున్నది. హరీష్ రావు జవాబులకు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయారు. అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఇరిగేషన్ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరం. 15 మాసాల క్రితం హిమాచల్, 8 మాసాల క్రితం కర్ణాటకలో, 72 రోజుల క్రితం 10, 5, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలమయింది’’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి అన్నారు.

‘‘రైతుభరోసా అమలు చేస్తారా ? చేయరా ? ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడం మీద ప్రభుత్వం స్పష్టం చేయాలి. కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నది. కాళేశ్వరంపై అత్యన్నతస్థాయిలో విచారణ జరిపించండి .. ప్రభుత్వం మీ చేతిలోనే ఉన్నది .. ఏ చర్యకైనా, విచారణకైనా బీఆర్ఎస్ సిద్దం. బీఆర్ఎస్ మీద కక్ష్యతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయవద్దు. కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లు, టన్నెళ్లను వాడుకునేందుకు అవకాశం ఉన్నది. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న దుగ్దతో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు’’ అని మాజీ మంత్రి మండిపడ్డారు.