Site icon HashtagU Telugu

BRS, Congress Big Fight: బీఆర్ఎస్ ను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ భారీ స్కెచ్

Telangana (13)

Telangana (13)

BRS, Congress Big Fight: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ కు ప్రధాన పోటీదారుడిగా పావులు కదుపుతుంది. కర్ణాటకలో సాధించిన విజయంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా జోష్ మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అధికారానికి రెండుసార్లు దూరమై ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకునే వాస్తవిక అవకాశాన్ని చూస్తోంది. గత నెలలో ప్రకటించిన ఆరు హామీలను ఎత్తిచూపుతూ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ రాష్ట్రంలో తీవ్ర ప్రచారానికి తెరలేపాలని చూస్తోంది. బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు కీలక నేతలు తమ పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌ నైతిక స్థైర్యం పెరిగింది.

2021లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కేసీఆర్ మోడీ(Modi) ని కలిసి, మద్దతు కోరడం, ఈ క్రమంలో ఎన్‌డిఎలో భాగమయ్యేలా చేయమని మోడీకి విజ్ఞప్తి చేసినట్టు మోడీ ఇటీవల షాకింగ్ కామెంట్స్ కాంగ్రెస్‌కు రాజకీయంగా లబ్ది చేకూరనుంది. బీఆర్‌ఎస్‌ బీజేపీకి ‘బీ టీమ్‌’ అన్న తమ ఆరోపణను మోదీ వాదన రుజువు చేస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ, బీఆర్‌ఎస్, ఏఐఎంఐఎం భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయని వాదించారు.

కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని లూటీ చేసినా మోదీ మాత్రం తమకు భాగస్వామ్యం ఉన్నందున విచారణకు ఆదేశించలేదన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు ప్రతిపక్ష నేతల వెంటే ఉన్నాయి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి, ఏఐఎంఐఎం నేతలపై కేసులు లేవు. నరేంద్ర మోదీ తన సొంత మనుషులపై దాడి చేయడు. కేసీఆర్‌, ఏఐఎంఐఎం నేతలను ఆయన తనవారిగా భావిస్తారు అని రాహుల్ గాంధీ అన్నారు.

అక్టోబరు 3న నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ కేసీఆర్ పై చేసిన షాకింగ్ కామెంట్స్ తరువాత కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్, బీజేపీలపై దాడులను ఉధృతం చేసింది. కేసీఆర్ అవినీతిలో బీజేపీకి కూడా వాటా దక్కడం వల్లే కేసీఆర్ అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ గురించి మోదీ బహిరంగానే చెప్పడంతో ముస్లిం ఓట్లు తమకే దక్కుతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మోడీ వెల్లడించిన నేపథ్యంలో ఏఐఎంఐఎం తన వైఖరిని స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, ముఖ్యంగా కాళేశ్వరం, ధరణి పోర్టల్ పేరుతో భూ ఆక్రమణలపై కాంగ్రెస్ దృష్టి సారిస్తోంది.

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌పై కాంగ్రెస్ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తోంది. టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా రెండోసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు రద్దు చేయడంతో కేసీఆర్ ప్రభుత్వంపై దాడి చేసేందుకు కాంగ్రెస్ కు అవకాశం లభించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, దళిత కుటుంబాలకు భూమి వంటి నెరవేర్చని హామీలపై కూడా కాంగ్రెస్ బీఆర్‌ఎస్ దృష్టికి తీసుకువెళుతోంది. తెలంగాణ సాధన ప్రాముఖ్యతను గ్రహించిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్రంపై దృష్టి సారిస్తోంది.

క‌ర్ణాట‌క విజ‌య‌ప‌ర‌ణ‌ను తెలంగాణ‌లోనూ కొనసాగించేందుకు ఆరు హామీల‌పై దృష్టి సారిస్తోంది. ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, తెలంగాణ వ్యాప్తంగా టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కి వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీలు కాంగ్రెస్ ఖాతాలో వేసే ఆరు హామీల్లో ఉన్నాయి. ఆరు హామీలు మహిళలు, రైతులు, నిరాశ్రయులు, యువత మరియు సీనియర్ సిటిజన్లు వంటి వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

2014, 2018 ఎన్నికల్లో ఓటములు, ఫిరాయింపులు, అసెంబ్లీ ఉపఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పేలవమైన పనితీరు కనబరుస్తున్నప్పటికీ రాష్ట్రంలో తమదే బలమైన శక్తి అని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కొన్ని జిల్లాలకే పరిమితమైన భాజపాకు భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బలంగానే ఉంది.

Also Read: Telangana : రైతులందరికీ పెన్షన్ ఇచ్చే ఆలోచనలో సీఎం కేసీఆర్..?