Caste Survey : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుల గణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్షించారు. ఈ సర్వే యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేపై జాతీయ స్థాయి నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Caste Survey) మాట్లాడారు.
Also Read :Union Budget Facts : బ్లాక్ బడ్జెట్, చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్.. భారత బడ్జెట్ విశేషాల చిట్టా ఇదిగో
త్వరలోనే ముసాయిదా నివేదిక సమర్పణ
సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు. ఈ కుల గణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని రేవంత్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటేడ్ కమిషన్‌కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయని చెప్పారు. సర్వే ద్వారా సేకరించిన వివరాల డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో దాని ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి ఈసందర్భంగా వివరించారు. కొన్నిచోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించడం, కొన్ని ఇళ్లకు తాళాలు ఉండటం, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవటంతో కొన్ని కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2లోగా రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదికను అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read :Where is KCR : కేసీఆర్ ఎక్కడ ? గులాబీ బాస్ ‘హైడ్ అండ్ సీక్’.. కేటీఆర్ చేతిలో ‘కారు’ స్టీరింగ్
కులగణన సర్వే గురించి..
- 2024 సంవత్సరం నవంబర్ 6న రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే 2024) మొదలైంది.
- అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది.
- రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించింది. ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించింది. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి.