ED Vs KTR : ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో ఇంకో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు పంపింది. జనవరి 7న విచారణకు రావాలని ఈడీ పిలుపునిచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలకు కేంద్ర దర్యాప్తు సంస్థ(ED Vs KTR) సూచించింది.
Also Read :Dhirubhai Ambani Car : ధీరూభాయ్ అంబానీ నడిపిన కారు.. సౌత్ సూపర్‌స్టార్‌కు ఎలా చేరింది ?
తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విచారణ చేస్తోంది. మనీ లాండరింగ్‌కు పాల్పడటం ద్వారా ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ దర్యాప్తును ఈడీ ముందుకు తీసుకెళ్తోంది. ఫార్ములా ఈ కార్ రేసుల ఒప్పందం వ్యవహారంలో లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) అనే కంపెనీకి రూ.55 కోట్ల నగదు బదిలీలో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ లావాదేవీలలోని ఉల్లంఘనలపై కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ప్రశ్నించనున్నారు.
Also Read :Manmohan Last Rites : ఉదయం 11.45 గంటలకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు
ఫార్ములా ఈ-రేస్‌కు సంబంధించిన ఒప్పందాలతో మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ సర్కారుకు ఆర్థిక నష్టాన్ని కలిగించారని పేర్కొంటూ హైకోర్టులో ఏసీబీ శుక్రవారం రోజు కౌంటర్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర క్యాబినెట్, ఆర్థిక శాఖల ఆమోదం లేకుండానే చెల్లింపులు చేయాలని కేటీఆర్ ఆదేశించారని ఏసీబీ ఆరోపించింది. విదేశీ సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO)కు అనుమతి లేకుండానే రూ.54 కోట్లకు పైగా చెల్లించినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. తద్వారా హెచ్ఎండీఏపై రూ.8 కోట్లకు పైగా భారం పడిందని తెలిపారు. ఎఫ్‌ఐఆర్ దాఖలుతోనే కేసును కొట్టి వేయాలని హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించడం అనేది దర్యాప్తును అడ్డుకోవటమేనని ఏసీబీ వాదించింది. కేటీఆర్ పిటిషన్‌ను కొట్టివేయాలని ఏసీబీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.