Site icon HashtagU Telugu

Dalit Bandhu: దళితబంధుపై కేసీఆర్ కలెక్టర్లతో ఏమన్నాడో చూడండి

తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా, సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం గా పటిష్టం చేయడంలో దోహదపడుతుందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.

దళిత బంధును ఇప్పటికే ప్రకటించిన పద్దతిలోనే ప్రభుత్వం అమలు చేస్తుందని, దానికి సంబంధించిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును ముందుగా ప్రకటించిన విధంగానే అమలు చేస్తామని, తాము ఎప్పుడు మోసగించబడుతామనే దుఃఖం దళిత వాడల్లో వుందని, వారి ఆర్తిని అర్థం చేసుకొని పని చేయాల్సిన అవసరముందని కేసీఆర్ అన్నారు.

అన్ని జిల్లాల కలెక్టర్లకు దళితబంధుపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు చేసిన ఏ పనిలో లేని తృప్తి దళిత బంధు పథకం అమలు లో పాల్గొనడంలో దొరుకుతుందని కలెక్టర్లకు సీఎం కెసీఆర్ స్పష్టం చేశారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను, వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలని, అందుకు దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక వేత్తల సలహాలు సూచనలు తీసుకోవాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లకు సూచించారు.