Telangana Cong: టీపీసీసీలో మళ్లీ రేవంత్ రెడ్డి Vs కోమటిరెడ్డి.. పైచేయి ఎవరిది?

తెలంగాణ కాంగ్రెస్ లో ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరిందా? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలు మళ్లీ మొదటికొచ్చాయా?

  • Written By:
  • Publish Date - April 3, 2022 / 10:46 AM IST

తెలంగాణ కాంగ్రెస్ లో ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరిందా? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలు మళ్లీ మొదటికొచ్చాయా? నిన్నమొన్నటి దాకా రేవంత్ పై వాగ్బాణాలు సంధించిన కోమటిరెడ్డి ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయడం హస్తం పార్టీలో అలజడి రేపుతోందా? మరి కోమటిరెడ్డి ఫిర్యాదుపై రాహుల్ గాంధీ ఎలా రియాక్ట్ అయ్యారు? తెలంగాణ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఢిల్లీ పెద్దలు ఏమన్నారు? కలిసిపోయారనుకున్న నేతలు ఎందుకు మళ్లీ కత్తులు దూసుకుంటున్నారు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించే నేతల్లో ఎక్కువ మంది ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా వీరిదే కీ రోల్. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి బడా నేతలు పార్టీలో చాలా కీలకం. అయితే రేవంత్ రెడ్డి… టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయనకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు నేతల నుంచి వ్యతిరేకత తప్పడం లేదని టాక్. దీంతో వారందరితో సఖ్యతగా ఉండేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కుందూరు జానారెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. కానీ ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డి లాంటి నేతలు మాత్రం.. యాంటీ రేవంత్ గ్రూపుగా తయారయ్యారనే వాదనలు ఉన్నాయి.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డికి ఇప్పటికీ మింగుడు పడడం లేదంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమించిన వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెట్టి ఫస్ట్ లైన్ లో ఉన్నారు. కానీ ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి వైపు చూడటంతో.. అప్పట్లో ఏఐసీసీ పెద్దలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కోమటరెడ్డి వెంకట్ రెడ్డి.

కొంతకాలంపాటు.. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మీద కోమటిరెడ్డి బ్రదర్స్ మాటల తూటాలు పేల్చారు. తర్వాత అధిష్టానం దూతలు రంగప్రవేశం చేయడంతో.. కాస్త వెనక్కి తగ్గిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి…. రేవంత్ తో కలిసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆ తర్వాత.. రేవంత్ రెడ్డి సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికెళ్లి మంతనాలు జరిపారు. దీంతో ఇద్దరూ కలిసిపోయారని ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ క్యాడర్ సంతోషపడింది. కానీ అదంతా.. మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిందనే టాక్ వినిపిస్తోంది. సీన్ కట్ చేస్తే.. గతకొద్ది రోజులుగా.. రేవంత్ టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో.. సామాజిక మాధ్యమాల్లో రేవంత్ తన సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కువైందని.. ఏకంగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఈమధ్య పెట్టిన పలు పోస్టులను సైతం.. రాహుల్ కు చూపించారట కోమటిరెడ్డి.

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎంపీలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇద్దరూ.. రాహుల్ గాంధీని కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డే మాటలు ఫైనల్ అని.. ఆయన మాటలే హైకమాండ్ వింటుందని.. ఇతర నాయకులను ఏఐసీసీ పట్టించుకోవడం లేదన్న తరహాలో రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారట కోమటిరెడ్డి.

ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్ర సీనియర్ నేతలకు సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్లు దొరకడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. అలాంటి ప్రచారాలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని.. అన్ని అంశాలు పరిశీలిస్తామని రాహుల్ వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో.. సీనియర్లు వర్సెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ అన్నట్లుగా కోల్డ్ వార్ కొనసాగుతుందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ పార్టీ నేతలను కాంగ్రెస్ అధినాయకత్వం హస్తినకు పిలిచింది. అక్కడ కూడా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.