సూర్యాపేట జిల్లా రాయన్నగూడ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు కొబ్బరికాయలతో నిండిన లారీ (Coconut Truck) అదుపు తప్పి బోల్తా పడింది. వేగం ఎక్కువగా ఉండటం, డ్రైవర్‌కు నిద్రమత్తు కలగడం వంటి కారణాలు ఈ ప్రమాదానికి దారితీసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డుపై వందల కొద్దీ కొబ్బరికాయలు చెల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడ రద్దీ పెరిగింది.
GST 2.0: ఇకపై అత్యంత తక్కువ ధరకే లభించే వస్తువులీవే!
ఈ సంఘటనను గమనించిన స్థానిక గ్రామస్తులు, అటు గుండా వెళ్తున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొబ్బరికాయలను ఎవరికి దొరికితే వారు సేకరించుకోవడం ప్రారంభించారు. కొందరు సంచులు, బస్తాలు తెచ్చి నింపుకుని వెళ్లగా, కార్లలో వెళ్తున్న వారు కూడా ఆగి కొబ్బరికాయలు తీసుకెళ్లారు. దీంతో కొన్ని గంటలపాటు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. లారీ డ్రైవర్ చెప్పిన ప్రకారం, సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నష్టంతో అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడిపోయిన లారీని క్రేన్ సహాయంతో తొలగించి రాకపోకలు సాఫీ చేశారు. స్థానికులు ఇలా ఆస్తి నష్టానికి కారణమవుతున్న తీరు పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ సంఘటన మరోసారి రహదారులపై వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. డ్రైవర్లు చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా పెద్ద నష్టాలకు దారి తీస్తుందనే పాఠం ఈ ప్రమాదం అందిస్తోంది.
