Sarpanchs Pending Bills : రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెండింగ్ ఉన్న బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల మంజూరు కోరుతూ మాజీ సర్పంచులు చేపట్టిన చలో సెక్రటేరియట్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులపై రఘునందన్ రావు స్పందించారు. పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన చేస్తుంటే అరెస్టులు చేయడం దారుణం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని. గత ప్రభుత్వం కారణంగా సర్పంచులంతా ఉపాధి కూలీలుగా, ముంబయికి వెలసబాట పట్టారని విమర్శించారు. పెండింగ్ బిల్లలను విడుదల చేయాలని కోరుతూ చలో సెక్రటేరియట్ పిలుపునిస్తే వారిని అరెస్టు చేయడం దారుణం అని, సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని వారం రోజుల్లో పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, తెలంగాణలోని ప్రతి గ్రామంలో గత ఐదేళ్లలో సర్పంచులు రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు చేశారు. కొంత ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయి. మరికొంత గ్రామ సర్పంచులు కలిపి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. బిల్లులు మాత్రం రాలేదు. దీంతో చాలామంది సర్పంచులు అప్పులపాలయ్యారు. పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కారు. అయితే ఇన్నాళ్లు పెండింగ్ బిల్లుల కోసం మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ, ప్రకటన రాలేదు. దీంతో వారి ఆందోళనను రాజధానికి షిఫ్ట్ చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చారు. పోరుబాట నేపథ్యంలో.. మాజీ సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
Read Also: MLC by election : ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ బైపోల్ షెడ్యూల్ విడుదల