Chandrababu – Revanth : చంద్రబాబు లేఖపై సీఎం రేవంత్ సానుకూల స్పందన..6న భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు.

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 06:45 AM IST

Chandrababu – Revanth : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. దీనికి సమాధానం ఇస్తూ చంద్రబాబుకు రేవంత్ కూడా  లేఖ రాయనున్నారు.  ఆ తర్వాత ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ఈనెల 6వ తేదీన తొలిసారిగా భేటీ కానున్నారు. హైదరాబాద్‌ లోని ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం జరిగే అవకాశం ఉంది.  పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామని సీఎం రేవంత్ మొదటి నుంచే చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలతో ముడిపడిన అంశాలు, ఇప్పటిదాకా అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశాలపై తెలంగాణ, ఏపీలకు(Chandrababu – Revanth) ప్రయోజనం చేకూరేలా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుందామనే ధోరణిలో సీఎం రేవంత్ ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join

అంతకుముందు తెలంగాణ సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో ఏపీ సీఎం చంద్రబాబు ఏం ప్రస్తావించారో ఓసారి చూద్దాం.. ‘‘ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందాం. ఇందుకోసం ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశమవుదాం. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయి. రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. విభజన హామీల పరిష్కారం కోసం కలిసి చర్చించుకోవడమే మంచిది. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుంది. పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతోంది’’ అని పేర్కొంటూ తెలంగాణ సీఎం రేవంత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read :WhatsApp: భారతదేశంలో 66 లక్షల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

‘‘ తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ చేస్తున్న విశేషమైన కృషికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా.. తెలుగు రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మన నిబద్ధత, సహకారం ఎంతో కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి ఈ సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది’’ అని తెలంగాణ సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.