Site icon HashtagU Telugu

CM Revanth Instructions: జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్!

CM Revanth Instructions

CM Revanth Instructions

CM Revanth Instructions: తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Instructions) ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని, ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్చార్జి మంత్రులు, ఇన్చార్జి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ధాన్యం కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నివేదికను ప్రతిరోజు సమర్పించాలని ఆదేశించారు.

Also Read: CM Revanth Reddy Request: బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎక‌రాలు బదిలీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డి విన‌తి!

అదేవిధంగా మిల్లులకు ధాన్యం కోసం లారీల ఇబ్బంది లేకుండా చూడాలి. సన్నరకం పండించిన రైతులకు బోనస్ గా 500 రూపాయలు ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, గిట్టుబాటుధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో ఈ ప్రజా ప్రభుత్వం అన్ని పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో 66లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారు. ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉంది. సరిహద్దు జిల్లాల్లో నుంచి బోనస్ కోసం ధాన్యం రాష్ట్రంలోకి వస్తుంది. ఆ ధాన్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు.

ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండగను జరుపబోతున్నాం. దానిని పురస్కరించుకొని 28, 29, 30 తేదీల్లో మహబూబ్ నగర్ లో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో రైతు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 30న జరిగే రైతు పండుగను కలెక్టర్లు అందరు సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై రైతులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ప్రజలకు చేరే విధంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు.