CM Revanth On Transgenders: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎంగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి (CM Revanth On Transgenders) తనదైన శైలిలో పరిపాలన చేస్తూ దూసుకుపోతున్నారు. వినూత్న ఆలోచనలు, కొత్త కొత్త ప్రణాళికలను జనంలోకి తీసుకువస్తున్నారు. అయితే గతంలో ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నా సీఎం రేవంత్ ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టే దిశగా అధికారులకు ఆదేశాలిస్తున్నారు. గతంలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పిస్తానని మాటిచ్చిన సీఎం రేవంత్ ఆ మాటను నిలబెట్టుకునే విధంగా గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో వారి సేవలను త్వరగా ప్రభుత్వం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలి దశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్.. నేటి నుంచి కొత్త ఆంక్షలు అమలు!
నగరంలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా తాగి వాహనాలు నడపే వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు. వారికి హోమ్ గార్డ్ తరహాలో జీత భత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, ప్రత్యేక డ్రెస్ కోడ్ ను రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం అదేశించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం
ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ఆవిష్కరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 18న గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా- మలేషియా జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఛైర్మన్ శివసేనారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.