పద్మ అవార్డుల (Padma Awards) విషయంలో తెలంగాణకు న్యాయం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం నుంచి ఐదుగురి పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు. గద్దర్, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు , ఇది పార్టీ పరంగా కాకుండా, ప్రజాదరణ ఉన్న గొప్ప వ్యక్తుల ఎంపికగా పంపించడం జరిగిందన్నారు.
గద్దర్ జయంతి సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. తెలంగాణ ప్రతిపాదించిన వారికంటే ఏపీకి ఎక్కువ మంది అవార్డులు లభించడం ఏంటి అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురికి అవార్డులు ప్రకటించిన నేపథ్యంలో, తెలంగాణకు కూడా సమానమైన గౌరవం దక్కాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారని, వారికి గుర్తింపు రావాలని కోరారు. సిఫార్సు చేసినవారి మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ, వారంతా ప్రజల్లో నిలిచిపోయిన మహానుభావులేనని సీఎం స్పష్టం చేశారు. ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదని, తెలంగాణ సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Vijayasai Reddy : వైసీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా.. జగన్‌కు పంపించా : విజయసాయిరెడ్డి
తెలంగాణ ఉద్యమకారులైన, ప్రజా గాయకులైన గద్దర్, గోరటి వెంకన్న వంటి వారిని పద్మ పురస్కారాలకు సిఫార్సు చేయడం ద్వారా, ఉద్యమ చరిత్రకు కేంద్రం గౌరవం ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. ప్రజా విద్యా మార్గదర్శిగా పేరుగాంచిన చుక్కా రామయ్య, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించిన అందెశ్రీ, ప్రముఖ చరిత్రకారుడు జయధీర్ తిరుమలరావుల వంటి వారు కూడా ఈ గౌరవానికి అర్హులే అన్నారు. ఏది ఏమైనప్పటికి పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు సముచిత గౌరవం దక్కాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని గొప్ప వ్యక్తులను పురస్కారాలతో గౌరవించడం ద్వారా, వారి సేవలకు నిజమైన గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.