తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముందు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం-2018లో ఉన్న ఒక నిబంధనను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిబంధన ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ నిబంధనను రద్దు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 21(3)ని తొలగించడం ద్వారా బి.సి.లకు రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బి.సి.లకు 23% ఉన్న రిజర్వేషన్లను 42%కి పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ రిజర్వేషన్ల పెంపునకు చట్టంలో మార్పులు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనను త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గం ముందు ఉంచి ఆమోదం పొందనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
AP Free Bus For Women : మహిళలకు బిగ్ షాక్.. ఆ బస్సుల్లో..ఆ రూట్లలో ఉచిత ప్రయాణం లేనట్లేనా..?
ఈ చట్ట సవరణల వల్ల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అనేక మంది అభ్యర్థులకు ప్రయోజనం కలగనుంది. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్న కారణంగా పోటీ చేయలేని వారు ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది రాజకీయంగా కూడా పార్టీలకు లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు. చాలామంది అభ్యర్థులు ఈ నిబంధన వల్ల ఎన్నికల్లో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అది రద్దు అయితే, వారికి మరో అవకాశం దొరికినట్లే.
ఈ మార్పులు అమలులోకి వస్తే.. తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. బి.సి.లకు రిజర్వేషన్లు పెరగడం, ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనడం వంటి అంశాలు ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ, ఇది కార్యరూపం దాల్చితే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ముఖచిత్రం మారే అవకాశం ఉంది.